మరో సూపర్‌ బజార్‌కు మంగళం..! | - | Sakshi
Sakshi News home page

మరో సూపర్‌ బజార్‌కు మంగళం..!

Jun 29 2025 6:55 AM | Updated on Jun 29 2025 6:55 AM

మరో సూపర్‌ బజార్‌కు మంగళం..!

మరో సూపర్‌ బజార్‌కు మంగళం..!

● ఇప్పటికే నస్పూర్‌లో మూసివేత ● ఈ నెల 30తో రామకృష్ణాపూర్‌లో క్లోజ్‌ ● సింగరేణి నిర్ణయంతో కార్మికులపై భారం ● రాయితీ సరుకులకు కార్మిక కుటుంబాలు దూరం ● ఉనికి కోల్పోనున్న కార్మిక క్షేత్రం

సింగరేణి సంస్థ కార్మికులకు మేలురకమైన సరుకులు అందించేందుకు ఏర్పాటు చేసిన సూపర్‌ బజార్లకు మంగళం పాడుతోంది. ఇటీవలే నస్పూర్‌లోని సూపర్‌ బజార్‌ను మూసివేసిన సంస్థ యాజమాన్యం ఇప్పుడు రామకృష్ణాపూర్‌ సూపర్‌ బజార్‌పై కన్నేసింది. జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం, వర్క్‌షాప్‌, టింబర్‌యార్డు, స్టోర్స్‌.. ఇలా అనేక కార్యాలయాలు, భూగర్భ గనులతో తులతూగిన రామకృష్ణాపూర్‌ పట్టణం.. సూపర్‌ బజార్‌ మూసివేతతో ఉనికినే కోల్పోయే దుస్థితికి చేరనుంది. ఎంతో శ్రమకోర్చి చెమటోడ్చిన బొగ్గు గని కార్మికులు ఇప్పుడు సింగరేణి సూపర్‌ బజార్లకు నోచుకోని పరిస్థితి నెలకొంది. బొగ్గు గనులతో పాటు కార్మికుల సంక్షేమానికి కూడా యాజమాన్యం గండి కొడుతోందన్నా విమర్శల నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం.

రామకృష్ణాపూర్‌: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్‌ పట్టణంలోని సింగరేణి సూపర్‌ బజార్‌ ఈ నెలాఖరుతో మూతపడనుంది. పైనుంచి వెలువడిన ఆదేశాల మేరకు మూసివేతకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడి సరుకులను మందమర్రి సూపర్‌బజార్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. సింగరేణి కార్మికులకు ఇప్పటి వరకు సూపర్‌ బజార్‌లు నిత్యావసర సరుకులే కాకుండా ఎలక్ట్రానిక్‌ పరికరాలను కూడా అందిస్తూ వచ్చాయి. సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్దెర రూపంలో నిత్యావసర సరుకులు లభిస్తుండేవి. ఎలక్ట్రానిక్‌ పరికరాలకు ఈఎమ్‌ఐ ద్వారా చెల్లించే వెసులుబాటు ఉండేది. ఉద్యోగుల వేతనం నుంచి డబ్బులు కట్‌ చేసేవారు. అయితే కొన్ని రోజులుగా ఇక్కడి సూపర్‌బజార్లో నిత్యావసర సరుకులు నిలిపివేయడమే కాకుండా మొత్తానికే ఎత్తివేస్తున్నారని తెలిసి స్థానికులు అవాక్కవుతున్నారు. సంస్థ మనుగడ కోసం తమ చెమటను ధారబోసినా కనీసం సూపర్‌బజార్లకు కూడా నోచుకోక పోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సూపర్‌ బజార్‌ అంటే ఓ బ్రాండ్‌...

సింగరేణి వ్యాప్తంగా సంస్థ సూపర్‌ బజార్లంటే ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ ఉండేది. రామకృష్ణాపూర్‌లో షాపు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని సూపర్‌బజార్‌ ఏరియా అనే పేరుతో పిలిచేవారు. ఇక్కడి సూపర్‌ బజార్లో నిత్యావసర సరుకులే కాకుండా టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు కార్మికులకు అందుబాటులో ఉండేవి. గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ కూడా వీటి ద్వారానే జరిగేది. ఇలాంటి సూపర్‌ బజార్‌ను ఉన్నట్టుండి ఒక్కసారిగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఆర్‌కేపీ సూపర్‌ బజార్‌ ఇప్పుడు మూసివేస్తున్నారని తెలిసి పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌ బజార్‌ పర్యవేక్షణ జరిపే ఉద్యోగి ఈ నెలాఖరుతో రిటైర్‌ అవుతున్న నేపథ్యంలో అతని స్థానంలో మరొకరిని నియమించి సరుకులను అంటుబాటులో ఉంచి షాపును కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ ఇలా మూసివేయడంపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మొన్న నస్పూర్‌..నేడు ఆర్‌కేపీ

సింగరేణి వ్యాప్తంగా సూపర్‌ బజార్లకు స్వస్తి పలకాలని భావిస్తున్న యాజమాన్యం వీటి మూసివేతే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. శ్రీరాంపూర్‌ ఏరియాలో ఇప్పటికే శ్రీరాంపూర్‌ సూపర్‌ బజార్‌ మూసివేతకు గురికాగా కొద్ది రోజుల క్రితమే నస్పూర్‌ సూపర్‌ బజార్‌ను మూసివేశారు. ఉన్నతాధికారుల చర్యలు చూస్తుంటే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఎత్తివేయడమే సంస్థ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుందని కార్మికుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఆర్‌కేపీ సూపర్‌బజార్‌ మూసివేతతో ఈ ప్రాంతమే ప్రాభవం కోల్పోతుందని చెప్పాలి. ఇప్పటివరకు వీటిపైన ఆధారపడి ఉన్న సింగరేణి కార్మికులు ఇక ప్రైవేట్‌ దుకాణాలను ఆశ్రయించే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ప్రైవేటుకు ధీటుగా డీమార్ట్‌ స్థాయిలో చక్కటి సూపర్‌ మార్కెట్‌వలే రామకృష్ణాపూర్‌ సూపర్‌ బజార్‌ను మార్చుకునే బిల్డింగ్‌, స్థలం అన్నీ ఉన్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా కాలగర్భంలో కలిపివేయడంతో కార్మికులు, స్థానికులు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రధాన కార్మిక సంఘాలు నోరు మెదపకుండా ఉండడంతో యూనియన్‌ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement