
రైళ్ల రాకపోకలకు అంతరాయం
బెల్లంపల్లి: పెద్దపల్లి రైల్వే జంక్షన్ శివారులోని కూనారం ఆర్‌ఓబీ వద్ద క్లస్టర్ విరిగిపోయి గడ్డర్లు కుంగడంతో శుక్రవారం కాజీపేట–బల్లార్షా సెక్షన్ పరిధిలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తుగా ఈ మార్గంలో రైళ్లను ఎక్కడికక్కడ రైల్వేస్టేషన్లలో నిలిపివేయడంతో గంటలకొద్దీ ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్ని రైళ్లను కాజీపేట నుంచి అటువైపే నడపాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని మంచిర్యాల, బెల్లంపల్లి, రవీంద్రఖని, రేచినీరోడ్ రైల్వేస్టేషన్, ఆసిఫాబాద్ ఎక్స్‌రోడ్, కాగజ్‌నగర్, సిర్పూర్ రైల్వేస్టేషన్లు బోసిపోయాయి. హైదరాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్–బీదర్ వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు పొత్కపల్లి రైల్వేస్టేషన్ వరకు నడపనున్నారు. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పాక్షికంగా కాజీపేట నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్యలో రద్దు చేశారు. భద్రాచలం రోడ్ నుంచి బల్లార్షా వైపు వెళ్లే సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్ నుంచి బల్లార్షా మధ్య పాక్షికంగా రద్దు చేసి వరంగల్ నుంచి భద్రాచలం రోడ్ వరకు నడపనున్నారు. కాజిపేట–సిర్పూర్ వైపు వెళ్లే మెము ఎక్స్‌ప్రెస్ రైలు పొత్కపల్లి వరకే నడస్తుంది. బోధన్–సిర్పూర్ టౌన్–బోధన్ పుష్పుల్ రైలు రద్దు చేశారు. కాజీపేట–బల్లార్షా ఎక్స్‌ప్రెస్ రైలు రద్దయింది. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు కాజిపేట–సికింద్రాబాద్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు.