
రుణ లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా వార్షిక రుణ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ తిరుపతి, ఆర్‌బీఐ ఏజీఎం యశ్వంత్‌సాయి, నాబార్డ్ డీడీఎం వీరభద్రులు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ ప్రభుదాస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ రాధాకృష్ణన్‌తో కలిసి వివిధ బ్యాంకుల అధికారులతో రుణ లక్ష్యసాధనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి పంట రుణాలకు రూ.2,422 కోట్లు, దీర్ఘకాలిక రుణాలకు రూ.765 కోట్లు, వ్యవసాయ అనుబంధ రుణాలు రూ.157 కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.249 కోట్లు, మొత్తం వ్యవసాయ రంగానికి రూ.4,203 కోట్లు లక్ష్యంగా నిర్ధేశించినట్లు తెలిపారు. ప్రాధాన్యత రంగాలకు రూ.5,817 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,940 కోట్లు నిర్ధేశించినట్లు తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు రుణాలు సకాలంలో చెల్లించి తిరిగి పొందేలా అవగాహన కల్పించాలని తెలిపారు.