
గిరిజనుల పోడు పోరు
● అడవిలో చెట్ల పొదల తొలగింపు ● అడ్డుకున్న అటవీ, పోలీస్ అధికారులు
దండేపల్లి: మండలంలో కొద్ది రోజులుగా చల్లబడ్డ పోడు పోరు మళ్లీ మొదలైంది. అటవీ భూముల ఆక్రమణకు గిరిజనులు ప్రయత్నిస్తున్నారు. నాలుగైదు రోజులుగా మండలంలోని లింగాపూర్ అటవీ బీట్ 380 కంపార్ట్‌మెంట్‌లో దమ్మన్నపేట, మామిడిగూడ, గిరిజనులతోపాటు లింగాపూర్ గ్రామానికి చెందిన కొందరు నిరుపేదలు చెట్ల పొదలు తొలగిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నా వినిపించుకోవడం లేదు. దీంతో నాలుగు రోజులుగా పోరు సాగుతోంది. శుక్రవారం లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహాసీనొద్దీన్ అటవీ ప్రదేశానికి వెళ్లి చెట్లపొదలు తొలగిస్తున్న వారితో మాట్లాడారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చివెళ్లారు. పోలీసులు, అటవీ అధికారులు వెళ్లిన వెంటనే గిరిజనులు మళ్లీ పొదలు తొలగిస్తూ విత్తనాలు విత్తారు.