
ఇంటి కోసం మహిళ ఆత్మహత్యాయత్నం
మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఓ మహిళ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాప్రయత్నం చేయడం చర్చనీయాంశమైంది. మండలంలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కనుకదుర్గ కాలనీకి చెందిన పూరెల్లి లక్ష్మి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందించింది. తనకు ఫస్ట్ లిస్ట్‌లో పేరు వచ్చిందని ఫైనల్ లిస్ట్‌లో తొలగించారని ఆరోపించింది. 30 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ ఇండ్లల్లో గిన్నెలు కడుక్కుని జీవనం సాగిస్తున్నానని తెలిపింది. అద్దె చెల్లించలేక ఇబ్బంది పడుతున్నానని వివరించింది. ఇల్లు కేటాయించాలని కోరింది. దరఖాస్తు పరిశీలించిన అనంతరం అర్హత ఉంటే తప్పకుండా ఇల్లు మంజూరవుతుందని తహసీల్దార్ సమాధానం ఇచ్చారు. వెంటనే మహిళ తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి ముందుగానే వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుంది. ఇల్లు కేటాయించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. అక్కడున్న కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై ఆ మహిళ ప్రయత్నాన్ని నిలువరించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. సముదాయించి ఆమె ఇంటికి పంపారు.