
చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
● సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎదుట ప్రజాసంఘాల ధర్నా
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని కుమ్మరి స్వప్న (19) ఈ నెల 24న రాత్రి కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన ఘటన తెలిసిందే. కాగా స్వప్నను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవా రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపా రు. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మార్థిడి గ్రామానికి చెందిన కుమ్మరి లచ్చన్న–సుక్కవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు స్వప్న జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ రెండో సంవత్సరం చదువుతోంది. లచ్చన్న వ్యవసాయంతోపాటు ఆర్‌ఎంపీగా పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, స్వప్న మరణాన్ని లచ్చన్న కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వప్న చికిత్స పొందుతూ మృతి చెందిన అనంతరం లచ్చన్న హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేసి స్వప్న మృతదేహాన్ని అప్పగించారు. కాగా, స్వప్న మృతి మిస్టరీగానే మిగిలింది.
హాస్టల్ భవనం వద్ద ఆందోళన
స్వప్న మరణ వార్త తెలుసుకున్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజాసంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు, బీఆర్‌ఎస్ నాయకులు జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. స్వప్న మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్వప్న కు టుంబానికి రూ.50లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విష యం తెలుసుకున్న సీఐ ప్రమోద్‌రావు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. స్వప్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.
స్వగ్రామానికి మృతదేహం తరలింపు
ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు స్వప్న మృతదేహాన్ని ఆమె స్వగ్రామం మార్థిడికి హైదరాబాద్ నుంచి నేరుగా తరలించారు. కళాశాల భవనం వద్ద ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించారు.

చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి