
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
తాంసి: మనస్తాపంతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని జామిడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మునేశ్వర్ అరుణ్ (32) వ్యవసాయం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. గతేడాది అరుణ్ వివాహం నిశ్చయమై ఆ తర్వాత క్యాన్సిల్ అయింది. అలాగే తనకున్న రెండెకరాలపై జామిడి సహకార సంఘంలో రూ.2.30 లక్షల రుణం తీసుకోగా మాఫీ కాలేదు. దీంతో కొంతకాలంగా దిగులు చెందుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున పంటచేనుకు వెళ్లి పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అరుణ్‌ను అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రిలో తాంసి ఎస్సై ప్రణయ్‌కుమార్ పరిశీలించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గల్లంతైన యువకుడి
మృతదేహం లభ్యం
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని లాండసాంగ్వి శివా రు ప్రాంతంలోగల వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన యువకుడు జొగ్ధాన్ శేఖర్ (19) మృతదేహం శుక్రవారం లభ్యమైనట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని డాల్డా కంపెనీ ప్రాంతానికి చెందిన శేఖర్, వికాస్, కృష్ణ గురువారం చేపల వేటకు వెళ్లిన విషయం తెలిసిందే. చేపలు పట్టే సమయంలో శేఖర్ ప్రమాదవశాత్తు జారి వాగులో పడ్డాడు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. శేఖర్ కోసం గురువారం రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం గాలింపు కొనసాగించగా అతడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య