
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
● పర్యాటక ప్రదేశాలకూ సర్వీసులు ● మంచిర్యాల నుంచి టూర్ ప్యాకేజీలు ● 36 మంది ప్రయాణికులుంటే చాలు
మంచిర్యాలఅర్బన్: ఆదాయాన్ని రాబట్టి లాభాల బాట పట్టేలా అన్ని మార్గాలనూ ఆర్టీసీ అన్వేషిస్తోంది. విహారయాత్రలు, శుభకార్యాలకు వెళ్లాలనుకుంటే ఇళ్ల వద్దకు బస్సులు పంపుతోంది. తాజాగా టూర్ ప్యాకేజీలపై దృష్టి సారించింది. మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికులను ఆకుట్టుకున్న ఆర్టీసీ పుణ్యక్షేత్రాల దర్శనం, పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. తక్కువ చార్జీలతో భక్తులను ఆలయాలకు తీసుకెళ్లి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఆరు గంటలకు మంచిర్యాల బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరి ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం, గూడెం సత్యనారాయణస్వామి ఆలయం, గాంధారిఖిల్లా, శివ్వారం(మొసళ్ల చెరువు), త్రివేణి సంగమమైన కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాలను దర్శించుకుని రాత్రి 8 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటుంది. పెద్దలకు రూ.530, పిల్లలకు రూ.290 చార్జీలు ప్రకటించారు. భోజన, ఇతర ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
36 మంది సిద్ధంగా ఉంటే..
36 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే పుణ్యక్షేత్రాలకు ఏ రోజైనా బస్సులు నడపనుంది. మంచిర్యాల బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరి కొమురవెల్లి, చేర్యాల, ఆలేరు, కొలనుపాక, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి వెళ్లనుంది. సూపర్‌లగ్జరీ బస్సు ద్వారా కొమురవెల్లి ఆలయం తర్వాత వయా చేర్యాల, ఆలేరు మీదుగా కొలనుపాక చేరుకుని జైన దేవాలయం సందర్శన ఉంటుంది. అక్కడి నుంచి యాదగిరిగుట్ట చేరుకుని నృసింహాస్వామి ఆలయ దర్శనం, అనంతరం స్వర్ణగిరి ఆలయ సందర్శన ఉంటుంది.
ప్రయాణికుల కోసం ప్రత్యేకం
మంచిర్యాల డిపో ప్రత్యేక టూర్‌ప్యాకేజీ ఏర్పాటు చేసింది. టికెట్ ధర పెద్దలకు రూ.1300, పిల్లలకు రూ.700గా నిర్ణయించాం. ఏరోజైనా బస్సులు నడుపుతాం. శనివారం ఒక బస్సు డిపో నుంచి వెళ్లేలా చూస్తాం. దర్శనం, అల్పాహారం, భోజనాలు, ఇతరత్రా ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. బుకింగ్ కోసం 9959226004 నంబరులో సంప్రదించాలి.
– శ్రీనివాసులు, డీఎం, మంచిర్యాల