
మానవ అక్రమ రవాణా కేసులో కానిస్టేబుల్ డిస్మిస్
● నిందితుడిపై మూడు కేసులు ● 2022 నుండి విధులకు గైర్హాజరు ● ఎస్పీ కాంతిలాల్ పాటిల్
ఆసిఫాబాద్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ కామెర హరిదాస్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. 2019లో తిర్యాణిలో ఓ గిరిజన మహిళను మధ్యప్రదేశ్‌లో విక్రయించిన కేసులో హరిదాస్ నిందితుడు. అలాగే ఈ ఏడాది ఓ ఆదివాసీ గిరిజన మహిళను ఇద్దరు మధ్యవర్తుల సాయంతో మధ్యప్రదేశ్‌లో విక్రయించాడు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితుల్లో హరిదాస్ ఏ5గా ఉన్నాడు. అలాగే ఈ నెల 6న ఓ మహిళ మిస్సింగ్ కేసులో ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా, మధ్యప్రదేశ్‌లో బాధితురాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధిత మహిళ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం గుర్తించిన నలుగురు నిందితుల్లో హరిదాస్ ఏ1గా ఉన్నాడు. ఈ నెల 16న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 1989 పోలీస్ కానిస్టేబుల్ బ్యాచ్‌కు చెందిన హరిదాస్ 2019లో తిర్యాణి కేసు అనంతరం సస్పెండ్ అయ్యాడు. అనంతరం 2020లో చింతలమానెపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరాడు. 2022 నుంచి 2025 జూన్ 15 వరకు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యాడు. తాజాగా మళ్లీ మానవ అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడటంతో అతడిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఎస్పీ తెలిపారు.