
పాలేరును చితకబాదిన యజమాని..
● అవమానం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం..
సోన్: యజమాని చితకబాదాడని అవమానం తట్టుకోలేక పాలేరు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే రైతు వద్ద కుభీర్ మండలం మాలేగం గ్రామానికి చెందిన రాపని రమేశ్ నాలుగేళ్లుగా పాలేరుగా పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా పనికిరాక పోవడంతో ఆగ్రహించిన శ్రీనివాసరెడ్డి మరో ఇద్దరితో కలిసి మంగళవారం పాలేరును చితకబాదారు. దీంతో అవమానం తట్టుకోలేని పాలేరు పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రమేశ్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.