
కేయూ డిగ్రీ సెమిస్టర్ల ఫలితాలు విడుదల
కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏప్రిల్, మేలో నిర్వహించిన డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బి ఒకేషనల్, బీఏ ఎల్ ఐదవ, ఆరవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గురువారం వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం విడుదల చేశారు. ఐదో సెమిస్టర్ ఫలితాల్లో 13,963 మందికి గానూ 7,059 మంది (50.56 శాతం), ఆరో సెమిస్టర్‌లో 37,999 మందికి గానూ 19,060 మంది (50.16శాతం) ఉత్తీర్ణులయ్యారని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. ఆయా పరీక్షల ఫలితాలను కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య, సౌజన్య, పద్మజ, ఆసిం ఆక్బాల్, నాగరాజు, కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు
ఆయా డిగ్రీ కోర్సుల సెమిస్టర్ల విద్యార్థులకు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 15 రోజుల సమయం ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే సంబంధిత వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు.
త్వరలో 2, 4 సెమిస్టర్ల వాల్యుయేషన్ ప్రక్రియ..
డిగ్రీ కోర్సుల రెండు, నాలుగు, ఐదవ, ఆరవ సెమిస్టర్ల పరీక్షలు ఒకేసారి జరిగినా తొలుత ఫైనలియర్ విద్యార్థులకు సంబంధించిన ఆరవ సెమిస్టర్ పరీక్షలు, బ్యాక్‌లాగ్ ఐదవ సెమిస్టర్ పరీక్షల జవాబుపత్రాలు మూల్యాంకనం చేయించారు. తద్వారా ఆయా విద్యార్థులు వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఈసారి ప్రైవేట్ యాజమాన్యాలకు రీయింబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో పరీక్షల ఫీజులు చెల్లించడంలో జాప్యం చేసిన విషయం తెలిసిందే. దీంతో పరీక్షలు ఆలస్యంగా జరిగాయి. 2, 4 సెమిస్టర్ల పరీక్షల జవాబు పత్రాలకు సంబంధించిన మూల్యాంకనం త్వరలోనే నిర్వహించనున్నారు.
ఐదో సెమిస్టర్‌లో 50.56 శాతం..
ఆరో సెమిస్టర్‌లో 50.16 శాతం ఉత్తీర్ణత