
సిబ్బందిని లోపలే ఉంచి కార్యాలయ గదికి తాళం
● రెబ్బెన ఎంపీడీవో ఆఫీసు సిబ్బంది నిర్వాకం
రెబ్బెన: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి పనినిమిత్తం వచ్చిన ఓ వ్యక్తి లోపల ఉండగానే సదరు సిబ్బంది తలుపులకు తాళాలు వేసి వెళ్లిపోయిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎంపీడీవో కార్యాలయంలో టీ ఫైబర్ నెట్‌వర్క్‌కు సంబంధించిన పనిచేసేందుకు వచ్చిన వ్యక్తి కార్యాలయం లోపల గదిలో పని చేసుకుంటున్నాడు. ఎంపీడీవో కార్యాలయం మూసే సమయం కావడంతో సిబ్బంది ఎంపీపీ, ఎంపీడీవో ఇతర సిబ్బంది విధులు నిర్వహించే గదులను పరిశీలించి కార్యాలయం ప్రధాన ద్వారం తలుపులు మూసి తాళం వేసి వెళ్లిపోయారు. కాసేపటికి తన పనిని ముగించుకుని కార్యాలయం నుండి బయటకు వచ్చేందుకు ప్రధాన ద్వారం వద్దకు వచ్చే సరికి ప్రధాన ద్వారం తలుపులు తెరుచుకోలేదు. దీంతో విషయాన్ని తన తోటి సిబ్బందికి సమాచారం అందించాడు. వారు ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి తెలపడంతో వెంటనే సిబ్బందిని పంపించి కార్యాలయం తలుపులు తెరవడంతో సదరు వ్యక్తి బయటకు వచ్చాడు. ఈ విషయపై కార్యాలయ సూపరింటెండెంట్ వాసుదేవ్‌ను వివరణ కోరగా టీ ఫైబర్ నెట్‌వర్క్ పని చేసేందుకు వచ్చే సిబ్బంది సమయ పాలన పాటించకుండా కార్యాలయానికి వస్తూ వెళ్తుంటారని, గురువారం సాయంత్రం కార్యాలయం ముసే సమయంలో వచ్చి పనులు చేసుకుంటూ ఉండగా గమనించకుండా కార్యాలయ సిబ్బంది తాళం వేసినట్టు ఉన్నారన్నారు. వ్యక్తి లోపల ఉన్నట్టు వెంటనే విషయం తెలుసుకుని కార్యాలయం తలుపులు తెరిచామన్నారు.