
ఏసీబీకి చిక్కిన బల్దియా అకౌంట్ ఆఫీసర్
● మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా ● రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
కై లాస్‌నగర్: ఓ కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించేందు కోసం లంచం డిమాండ్ చేసిన ఆదిలాబాద్ మున్సిపల్ ఉద్యోగులు ఇద్దరిని ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం స్థానిక కార్యాలయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జి.మధు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ జిల్లాల సంతోష్ మున్సిపల్ పరిధిలో రూ.60లక్షల విలువైన సీసీ రోడ్లు, హైమాస్ట్ లైటింగ్ పనులు చేశారు. పనులకు సంబంధించి రూ.3.80లక్షల చెక్కు ఇచ్చేందుకు మున్సిపల్ అకౌంట్ సెక్షన్ ఆఫీసర్(ఏవో) బట్టల రాజ్‌కుమార్‌గౌడ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి కంప్యూటర్ ఆపరేటర్ కొండ్ర రవికుమార్ రూ.20 వేలు డిమాండ్ చేశారు. రూ.15 వేలు ఇచ్చేలా వారితో కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. సదరు ఉద్యోగుల తీరుతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.15 వేలు కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా మున్సిపల్ కార్యాలయంలోని అకౌంట్ సెక్షన్‌లో మున్సిపల్ ఏవోకు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. దాడుల్లో ఏసీబీ సీఐ కిరణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.