
డివిజన్ల విభజనపై ఉత్కంఠ
● వెలువడని కార్పొరేషన్ జాబితా ● ఆశావహుల ఎదురుచూపులు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల పునర్విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 21న జాబితా విడుదల కావాల్సి ఉండగా.. జాప్యం జరుగుతుండడంతో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మంచిర్యాల మున్సిపాల్టీలో నస్పూర్ మున్సిపాల్టీతోపాటు హాజీపూర్ మండలం వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, నర్సింగాపూర్, చందనాపూర్, కొత్తపల్లి, పోచంపాడ్ గ్రామాలను విలీనం చేసి ఈ ఏడాది జనవరిలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు వార్డులు, గ్రామాలుగా ఉన్న వాటన్నింటినీ కలిపి భౌగోళికంగా, ఓటర్ల సంఖ్యను బట్టి మొత్తం 60డివిజన్లుగా మార్చి అధికారులు ముసాయిదా జాబితా విడుదల చేశారు. విభజన ప్రతిపాదనలపై నోటీసులు నోటీసులు ఇవ్వడంతోపాటు సాధారణ ప్రజలు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు లేఖలను ఈ నెల 4వరకు అందజేశారు. 5నుంచి 11వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలను రాతపూర్వకంగా స్వీకరించారు. ఈ నెల 12నుంచి 16వరకు పరిష్కరించేలా విచారణ చేపట్టి, ఆమోదించిన అభ్యంతరాల ప్రకారం డివిజన్లను కొంత మార్చి కలెక్టర్ ఆమోదం కోసం ఈ నెల 18న పంపించారు. 19న పురపాలక శాఖకు, అక్కడి నుంచి 20న ప్రభుత్వానికి నివేదిక చేరింది. ప్రభుత్వ పరిశీలన అనంతరం తుది జాబితా 21న విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పటికీ వెలువడకపోవడంతో ప్రజల్లో, అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారిలో ఉత్కంఠ నెలకొంది.
అభ్యంతరాలు.. మార్పులు
భౌగోళికంగా డివిజన్లు సక్రమంగా లేవని, వాటిని మళ్లీ సవరించాలని 38 అభ్యంతరాలు వచ్చాయి. నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పరిశీలించి అందులో 19 అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుని మార్పులు చేశారు. మరో 13 అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఆరు అభ్యంతరాలు పాక్షిక మార్పులు చేశారు. వచ్చిన అభ్యంతరాల్లో ఎక్కువగా ఒక కాలనీ రెండు నుంచి నాలుగు డివిజన్లలోకి రావడం, కొన్ని ఇళ్ల నంబర్లు తప్పిపోవడం, కొన్ని కాలనీలు డివిజన్లలో కనిపించకపోవడం వంటివి అధికారులు గుర్తించారు. డివిజన్ల సరిహద్దులు స్వల్పంగా మారనుండగా ఓటర్ల జాబితా, డివిజన్‌లోని కాలనీల సరిహద్దుల్లో మార్పులు చేశారు.
సామాజిక మాధ్యమాల్లో జాబితా
ప్రభుత్వం, అధికారుల నుంచి కార్పొరేషన్ డివిజన్ల జాబితా విడుదల కాకముందే సామాజిక మాధ్యమాల్లో ఇవే డివిజన్లు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నెల 3న ప్రకటించిన జాబితా, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుగున్న జాబితాకు కొంత మార్పు ఉండడంతో నిజమే కావొచ్చని భావిస్తున్నారు. తమ డివిజన్ ఎక్కడ వస్తుందనే ఆసక్తితోపాటు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి ఏ ఏరియా నుంచి ఎక్కడి వరకు కలిసిందని ఆరా తీస్తున్నారు. జాబితా కొంత గందరగోళంగా ఉండడంతో ప్రభుత్వం తాత్సారం చేయకుండా జాబితా విడుదల చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.