
మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు
● డ్రగ్స్ నివారణకు అందరూ కృషి చేయాలి ● మంచిర్యాల ఏసీపీ ప్రకాష్
మంచిర్యాలక్రైం: యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని, డ్రగ్స్ నివారణకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా పని చేయాలని మంచిర్యాల ఏసీపీ రత్నపురం ప్రకాష్ అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని మంచిర్యాలలో అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల సమన్వయంతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తా నుంచి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం వరకు ర్యాలీ సాగింది. బెల్లంపల్లి చౌరస్తాలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం ద్వారా యువత భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని అన్నారు. మత్తుకు బానిసైన కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, మరికొందరు అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నారని తెలిపారు. క్యాలెండర్, యాంటి డ్రగ్స్ వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రమోద్‌రావు, రూరల్ సీఐ అశోక్‌కుమార్, ఎకై ్సజ్ సీఐ గురువయ్య, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వంగ చక్రపాణి, సీడీపీవో రేష్మ, శ్రావణి, ఎఫ్‌ఆర్‌ఓ ఫర్జానా తదితరులు పాల్గొన్నారు.