
చిత్తశుద్ధితో పథకాలు అమలు చేస్తున్నాం
ఎన్ని అడ్డంకులొచ్చినా సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. 18 నెలలుగా గత ప్రభుత్వం చేసిన అప్పు కింద ప్రతీనెల రూ.6,500 కోట్లు చెల్లిస్తున్నాం. అయినా రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశాం. రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నాం. రుణమాఫీకి నోచుకోని రైతులకు సింగిల్ విండో కౌంటర్ ఏర్పాటు చేసి పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నాం. భూభారతి చట్టం ద్వారా వివిధ దశల్లో తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు అధికారం ఇవ్వడం ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. చట్టాలు చేసేది మేమే అయినప్పటికీ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వాట్సాప్ నంబర్ క్రియేట్ చేయాలి. బాధితులు సమస్యలు లిఖితపూర్వకంగా సదరు నంబర్‌కు వాట్సాప్ చేస్తే పరిష్కరించేలా కలెక్టర్లు మానిటరింగ్ చేయాలి. సమస్యలు నిర్ణీత సమయంలో పరిష్కారం కాకుంటే తొలుత మౌఖికంగా, ఆ తర్వాత లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులను వివరణ కోరాలి. అప్పటికీ పరిష్కారం కాకుంటే బాధ్యులపై చర్య తీసుకోవాలి. నకిలీ విత్తనాలు సరఫరా చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేస్తూ అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించాలి.
– జూపల్లి కృష్ణారావు, ఇన్‌చార్జి మంత్రి