
విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలన
బెల్లంపల్లి: పాలిసెట్–2025 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు గురువారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ సెంటర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ ప్రక్రియను కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీఎస్‌వో కే.మధుకర్ బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవేందర్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కౌన్సెలింగ్ నిరాటంకంగా సాగింది. తొలుత విద్యార్థులను కౌన్సెలింగ్ కోసం ప్రత్యేక గదిలోకి పంపించి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. సర్టిఫికేట్లు పరిశీలించి ధ్రువీకరించారు. పాలిటెక్నిక్ కోర్సులు, వెబ్ ఆప్షన్ల నమోదు తదితర అంశాలపై అవగాహన కలిపించారు. తొలిరోజు కౌన్సెలింగ్‌కు 360మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ దేవేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల వివిధ బ్రాంచ్‌ల హెడ్‌లు బి.వెంకటేశ్వర్లు, ఎస్.నాగరాజు, వర్క్‌షాప్ సూపరింటెండెంట్ డి.రాందాస్, కౌన్సెలింగ్ ఇంచార్జీ టి.మధుకర్, అధ్యాపకులు పాల్గొన్నారు.