
ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం
● పొక్లెయిన్‌ను ఢీకొన్న కారు ● ఇద్దరు యువకులు దుర్మరణం
గుడిహత్నూర్: అతి వేగం రెండు ప్రాణాలు బలిగొంది. రెండు కుటుంబాల్లో విషాధం నింపింది. అతివేగంగా వచ్చిన కారు పొక్లెయిన్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు జైనూర్ మండల కేంద్రానికి చెందిన ఆర్యన్ ముండే (19), ఉట్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన గాయక్వాడ్ అనిల్ (21) ఇద్దరు స్నేహితులు. మంగళవారం రాత్రి కారులో వెళ్తుండగా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై వైజాపూర్ యూటర్న్ వద్ద పొక్లెయిన్‌ను అతివేగంగా ఢీకొట్టారు. గాయక్వాడ్ అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు కొనఊపిరితో ఉన్న ఆర్యన్‌ముండేను ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
ఎవరికీ తెలియకుండా పయనం..
ఆర్యన్ ముండే, గాయక్వాడ్ అనిల్ మంచి మిత్రులు. ఆర్యన్ ముండే స్వస్థలం మహారాష్ట్రలోని బోధిడి. తన అమ్మమ్మ ఊరైన జైనూర్‌లో ఉంటూ తాత వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఎవరికీ తెలియకుండా ఇంటి బయట ఉన్న కారు తీసుకుని ఉట్నూర్ ఎక్స్‌రోడ్డుకు వచ్చి తన మిత్రుడు గాయక్వాడ్ అనిల్‌కు ఫోన్ చేశాడు. దీంతో అనిల్ తన ఇంటి నుంచి స్కూటీపై ఏందా ఎక్స్‌రోడ్డు వద్దకు వచ్చాడు. స్కూటీని వదిలి ఆర్యన్‌తో కారులో ఆదిలాబాద్ వైపు బయలు దేరారు. మృతదేహాలకు బుధవారం రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వై.మధుకృష్ణ తెలిపారు.

ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం

ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం