
ప్రమాదవశాత్తా.. ఆత్మహత్యాయత్నమా?●
● కళాశాల భవనం పైనుంచి కిందపడి విద్యార్థినికి గాయాలు
మంచిర్యాలక్రైం: కళాశాల భవనం పైనుంచి కిందపడడంతో విద్యార్థినికి గాయాలైన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కుమురంభీం జిల్లా బెజ్జూర్ మండలం మార్థిడి గ్రామానికి చెందిన కుమ్మరి లచ్చన్న, సుక్కవ్వ దంపతుల రెండో కుమార్తె స్వప్న జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ మహిళా కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మంగళవారం రాత్రి కళాశాల భవనంపై నుంచి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. సిబ్బంది వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కాగా స్వప్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా? లేక ప్రమాదవశాత్తు కిందపడిందా? అనేది తేలాల్సి ఉంది. కళాశాల ప్రిన్సిపల్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆందుబాటులోకి రాలేదు. సీఐ ప్రమోద్‌రావుని వివరణ కోరగా ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. తోటి విద్యార్థులను విచారించగా ఆరేసిన డ్రెస్‌లు తెచ్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడిందన్నారు.
గ్వాలియర్–ఎస్‌ఎంవీటీ రైలు ప్రారంభం
బెల్లంపల్లి: గ్వాలియర్–ఎస్‌ఎంవీటీ (సర్‌ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్) వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. గురువారం గ్వాలియర్‌లో అధికారులు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈనెల 29 నుంచి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా ఈ రైలు ఎస్‌ఎంవీటీ బెంగళూరు నుంచి ప్రారంభం కానుండగా గద్వాల, మహబూబ్‌నగర్, కాచిగూడ, కాజీపేట, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లలో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. దిగువ మార్గంలో బెంగళూరు వైపు వెళ్లేటప్పుడు 11086 నంబర్‌తో వెళ్తుంది. బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌లో ప్రతీ శనివారం ఉదయం 11:08 గంటలకు వచ్చి 11:10 నిమిషాలకు బయలుదేరుతుంది. ఎగువ మార్గంలో ప్రతీ సోమవారం బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌కు ఉదయం 8:43 నిమిషాలకు వచ్చి 8:45 నిమిషాలకు బయలుదేరుతుంది. కాగా మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి జంక్షన్‌లో నిలుపుదల లేదు.
సుబేదార్ గంజ్...చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్
సుబేదార్ గంజ్–చర్లపల్లి (రైలు నెం.04121/04122) మధ్య మరో వీక్లీ ప్రత్యేక రైలు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు జులై 31 వరకు నడిపించనున్నారు. ఈ ప్రత్యేక రైలుకు సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట జంక్షన్‌లో నిలుపుదలకు ఉత్తర్వులు జారీ చేశారు.