
కార్మికులపై వేధింపులు మానుకోవాలి
● హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్
శ్రీరాంపూర్: తమమాట వినలేదన్న కారణంతో అధికారులు కార్మికులను వేధించడం మానుకోవాలని హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ లోని ఎస్సార్పీ 3, 3ఏ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. అధికారుల తప్పిదాలను ప్రశ్నిస్తే షిఫ్టులు మార్చి వేధింపులకు గురి చేస్తున్నారని, ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. పని స్థలాల వద్ద కార్మికులకు తాగునీటి సదుపాయం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికులతో కోల్ ఫిల్లింగ్ పనులు చేయిస్తూ వేతనం మాత్రం ఒకటో కేటగిరీ వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. జన్మభూమి పేరుతో కార్మికులపై అదనపు పని భారం మోపుతున్నారన్నారు. సమయానికి మ్యాన్‌రైడింగ్ నడుపకపోవడంతో కార్మికులు కాలినడకతోనే గనిలోకి దిగాల్సి వస్తుందన్నారు. కొంతమంది అధికారులు కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వారిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మికులు శశిధర్, గంగపెల్లి కమలాకర్, నర్సింగరావు, తదితరులు యూనియన్‌లో చేరగా వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు జక్కుల నారాయణ, తిప్పారపు సారయ్య, గొల్ల సత్యనారాయణ, బ్రాంచ్ కార్యదర్శి పొనగంటి అశోక్, నాయకులు దుర్గం లక్ష్మణ్, రేగుంట సందీప్, తుల అనిల్ కుమార్, చెవుల శ్రీనివాస్ పాల్గొన్నారు.