
● చదువుకునే వయస్సులో బలవన్మరణాలు ● స్కూల్, కాలేజీ విద్
మానసికంగా దృఢంగా ఉండాలి
గతంలో బోధకులు, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఉండేవి. చాలా చోట్ల ఇప్పుడా పరిస్థితి లేదు. ఆత్మహత్య చేసుకుంటున్న వారు అధికంగా వ్యక్తిగత, ప్రేమ విఫలం, ఫెయిలవడం, తల్లిదండ్రులు మందలించారనే ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులను తట్టుకునే విద్యార్థులు బాల్యం నుంచే కష్ట, సుఖాలు ఎదుర్కొనే స్థితిలో మానసికంగా దృఢంగా ఉండాలి. – పల్లె భూమేశ్, చైర్మన్,
శ్రీహర్ష విద్యాసంస్థలు
క్షణికావేశంతో బలవన్మరణాలు
తొందరపాటులో అనాలోచిత నిర్ణయాలతో బలవన్మరణాలు జరుగుతున్నాయి. జీవితంలో అన్నింటిని సమంగా చూసే స్థితిలో చాలామంది లేరు. విద్యార్థులు తమ జీవితంలో వ్యక్తిగతంగా, విద్యాపరంగా, కుటుంబంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం వెతకాలి. ఎంతో భవిష్యత్ ఉన్న జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకోవద్దు.
– అంబాల సమ్మయ్య, సైకాలజిస్టు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయస్సులో ఉసురు తీసుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉజ్వలమైన భవిష్యత్‌ను క్షణికావేశంలో కోల్పోతున్నారు. మరోవైపు చిన్న వయస్సులోనే ఈ మరణాలు సమాజంపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
క్షణికావేశం.. తొందరపాటు
కుటుంబ పెద్దలు, నిరుద్యోగులు, రైతులు అనేక కష్టాలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొని కొంత జీవితం అనుభవించాక దిక్కుతోచని పరిస్థితుల్లో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడేవారు. ఇటీవల స్కూల్, కాలేజీ విద్యార్థులు సైతం చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. టీనేజీలోనే ఆకర్షణలకు లోనవుతున్నారు. అబ్బాయి, అమ్మాయిల మధ్య మనస్పర్థలు వస్తే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక కొందరు చదువు ఇష్టం లేక ఒత్తిడికి గురవుతున్నారు. పది, ఇంటర్, బీటెక్ వంటి పరీక్షల్లో ర్యాంకు రాలేదని, ఫెయిల్ అయ్యామని, చదువులో రాణించలేకపోతున్నామని తదిత ర కారణాలతోనూ ఎంతో భవిష్యత్ ఉన్న వారంతా అర్ధంతరంగా కన్నవారికి దూరమవుతున్నారు.
లోపమెక్కడ?
పిల్లల పట్ల బాధ్యత వహించాల్సింది ముఖ్యంగా తల్లిదండ్రులేనని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. బాల్యం నుంచే పిల్లల నడవడి, తీరు, అలవాట్లు, ఆలోచనలు అంచనా వేస్తూ భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో అండగా నిలవాలని పేర్కొంటున్నారు. ఒత్తిడి చదువులు, వారి భావాలకు విరుద్ధంగా వ్యవహరించడం, అతి క్రమశిక్షణ, అతిగా స్వేచ్ఛ ఇవ్వడం ప్రమాదమని సూచిస్తున్నారు. పోషకులుగా తమ పిల్లల ఆలనాపాలనా చూస్తూ, వారి మానసిక స్థితి, ఆలోచనలకు విలువ ఇస్తూ బంధాలను బలోపేతం చేసుకోవాలని చెబుతున్నారు. సమస్యను పంచుకుని బాధలు తీర్చే సంరక్షకులుగా ఉంటే పిల్లలు మానసికంగా ఇబ్బంది పడరని అంటున్నారు. చదువుతోపాటు ఇష్టమైన రంగాల్లో రాణించేలా, గెలుపోటములు సమానంగా స్వీకరించేలా తీర్చిదిద్దాలని, నాయకత్వ లక్షణాలు అలవర్చాలని, క్లిష్ట పరిస్థితులను తట్టుకునేలా మనోధైర్యం నింపాలని, జీవితంలో నిలిచి గెలవాలని సూచిస్తున్నారు.
లేత వయస్సు మరణాలు..
● నస్పూర్ పరిధి షిర్కే కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని సెకండియర్ ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించింది.
● దండేపల్లికి చెందిన విద్యార్థి ఇంటర్ పూర్తి చేయగా.. బీటెక్ చదవడం ఇష్టం లేదంటూ.. పై చదువులకు వెళ్లనంటూ ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
● లోకేశ్వరం మండలం బిబోలికి చెందిన ఓ విద్యార్థి ఇటీవల పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియెట్‌కు బదులు వేరే కోర్సు చేస్తానని చెప్పగా.. తండ్రి మందలించడంతో తట్టుకోలేక క్రిమి సంహారక మందు తాగి చనిపోయాడు.
● లక్సెట్టిపేట పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమైన అంతలోనే ఉరేసుకుంది.
● తాజాగా మంచిర్యాలలోని సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజీలో ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

● చదువుకునే వయస్సులో బలవన్మరణాలు ● స్కూల్, కాలేజీ విద్

● చదువుకునే వయస్సులో బలవన్మరణాలు ● స్కూల్, కాలేజీ విద్

● చదువుకునే వయస్సులో బలవన్మరణాలు ● స్కూల్, కాలేజీ విద్