
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు
● ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం ● కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి ● కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు
జైపూర్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల కోసమే కట్టారని, వేలాది కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి విమర్శించారు. బుధవారం ఆయన జైపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో జైపూర్, ఇందారం, టేకుమట్ల, రామారావుపేట, ముదిగుంట, మిట్టపల్లి, కాన్కూర్ గ్రామాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చెన్నూర్ నియోజకవర్గానికి నీటిబొట్టు కూడా రాలేదని, ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించి వందల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలే నిలదీస్తారని అన్నారు. మూడేళ్లుగా ప్రాజెక్టులోకి నీళ్లు రావడం లేదని, ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కారణంగా 40వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని, ప్రాజెక్టు మూలంగా రైతులకు నష్టమే మిగిలిందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో మూడు వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా విచ్చలవిడిగా నడిచిందని, ప్రజల సొమ్ము దోపిడీ చేశారని విమర్శించారు. ప్రజలు స్వంత అవసరాలకు ప్రభుత్వ ఇసుక రీచ్‌ల ద్వారా సులభతరంగా పొందవచ్చని అన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూపన్ల ద్వారా ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
పేదల ప్రభుత్వం
చెన్నూర్/చెన్నూర్‌రూరల్/భీమారం: పేదల పక్షాన నిలబడేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. బుధవారం చెన్నూర్ క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. స్థానిక రాజీవ్ రోడ్డులో రూ.10లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చెన్నూర్ మండలం సుబ్బరాంపల్లి, కిష్టంపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు. భీమారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ ఎవరు ఇళ్లు ముందుగా నిర్మించుకుంటే వారి ఇంటి గృహ ప్రవేశానికి హాజరై భోజనం చేసి వెళ్తానని అన్నారు. ఇళ్ల మంజూరు కోసం ఎవరికీ లంచాలు ఇవ్వొద్దని కోరారు. భీమారంలో కేజీబీవీలో రూ.66లక్షలతో అదనపు డార్మెటరీ గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కలెక్టర్ కుమార్ దీపక్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు.

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు