
ప్రశ్నించే వారిపై దాడులు, కేసులు
● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్టా.. ప్రశ్నించే వారిపై దాడులు చేసి కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య అన్నారు. ఇటీవల మంచిర్యాలలో బీఆర్‌ఎస్వీ నాయకుడు దగ్గుల మధుకుమార్‌పై జరిగిన దాడిపై బుధవారం రామగుండం సీపీ అంబర్ కిషోర్‌ఝాకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రశ్నించే వారిపై దాడులు, కేసులు నమోదు చేస్తున్నారని, మంచిర్యాలలో 20 మందిపై తప్పుడు కేసులు నమోదు చేశారని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యమైందని అన్నారు. కిందిస్థాయి పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేశామని, ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు గ్యాంగ్ అరాచకాలు మితిమీరుతున్నాయని, దాడులు మళ్లీ జరిగితే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.