
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్‌సింగ్‌లతో కలిసి పోలీసు, రవాణా, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల సంస్థ, ఆర్టీసీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రమాదాల జరిగే ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. మిషన భగీరథ అధికారులు పైప్‌లైన్ మరమ్మతుల సమయంలో ముందస్తు సమచారం అందించాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో కూరగాయల మార్కెట్ కోసం స్థలాన్ని గుర్తించాలని, రహదారులు, కూడళ్లు వద్ద కూరగాయల విక్రయాన్ని నివారించి ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని తెలిపారు. మంచిర్యాల పట్టణం, నస్పూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జిల్లా రవాణా అధికారి సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.