కొమ్మలు కాదు.. చెట్లే నరికేశారు..! | - | Sakshi
Sakshi News home page

కొమ్మలు కాదు.. చెట్లే నరికేశారు..!

Jun 25 2025 7:04 AM | Updated on Jun 25 2025 7:04 AM

కొమ్మలు కాదు.. చెట్లే నరికేశారు..!

కొమ్మలు కాదు.. చెట్లే నరికేశారు..!

● విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్నాయని.. ● ఫిర్యాదుపై పట్టించుకోని అధికారులు ● ప్రజావాణిలో మూడుసార్లు ఫిర్యాదు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు విద్యుత్‌ శాఖ సిబ్బంది కొట్టేస్తుంటారు. జిల్లాలోని నెన్నెల మండల విద్యుత్‌ శాఖ అధికారులు ఏకంగా 80 చింతచెట్లు కొట్టేయించారు. దిగుబడి వచ్చే చెట్లను కొట్టేయడంపై బాధితుడు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నెన్నెల మండలం వెల్లంపల్లికి చెందిన ముడపల్లి మహేష్‌కు భీమారం మండలం కాజిపల్లి శివారు సర్వేనంబరు 94/1లో 4.12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. చుట్టూ 2015లో 90 చింతచెట్టు మొక్కలు నాటి పెంచుతున్నాడు. రెండేళ్లుగా చింతపండు దిగుబడి వస్తోంది. గత ఏడాది రూ.70వేలు ఆదాయం వచ్చింది. భవిష్యత్‌లో మంచి లాభాలు వస్తాయని ఆశిస్తే విద్యుత్‌శాఖ అధికారులు అడియాసలు చేశారు. నెన్నెల మండల విద్యుత్‌ శాఖ అధికారులు 2025 మే 5న వెంకటపూర్‌, కొత్తూర్‌కు కొత్త విద్యుత్‌ లైన్‌ ఏర్పాటుకు అడ్డుగా ఉన్నాయని 80 చెట్లు నరికేశారు. కొమ్మలు అడ్డుగా ఉంటే నరికేస్తారు. కానీ ఇక్కడ చెట్లే నరికేయడం గమనార్హం. అనుమతి లేకుండా చెట్లు నరికేశారని విద్యుత్‌శాఖ, తహసీల్దార్‌, అటవీశాఖ, పోలీసుస్టేషన్‌, ఉద్యానవన అధికారులకు, కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో మూడు సార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని బాధితుడు మహేష్‌ వాపోతున్నాడు. అటవీశాఖ అధికారులు పరిశీలించి చెట్ల విలువను టింబర్‌ రేట్‌ ప్రకారం రూ.17వేలుగా నిర్ణయించారని, అక్రమంగా నరికినందుకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారని తెలిపాడు. విద్యుత్‌ శాఖ అధికారులు తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులతో ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నాడు. నరికిన చెట్లు పొలంలోనే ఉండడంతో వరిసాగు చేసుకోవడం కష్టంగా మారిందని తెలిపాడు. ఏడాదికి రూ.లక్షలు ఆదాయం, వందేళ్ల దిగుబడి వచ్చే చెట్లను అన్యాయంగా నరికేశారని, న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పేలా లేదని పేర్కొన్నాడు.

కొమ్మలు నరికేశారు..

విద్యుత్‌ లైన్‌కు అడ్డుగా వస్తున్నాయి.. కొమ్మలు నరుకాలని ఏఈ సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించడంతో కొమ్మలు మాత్రమే నరికేశారు. చెట్లు నరకాలని చెప్పలేదు. చెట్లు ఎవరు నరికి వేశారో తెలియదు. బాధితుడు నా వద్దకు వచ్చి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ కొనసాగుతోంది.

– గంగాధర్‌, జిల్లా విద్యుత్‌ శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement