
కమిషనర్లకు కలిసిరాని చెన్నూర్
● మున్సిపాలిటీగా ఏర్పడి ఏడేళ్లు ● ఇప్పటికీ ఎనిమిది మంది బదిలీ ● కుంటుపడుతున్న పట్టణాభివృద్ధి
చెన్నూర్: కమిషనర్లకు చెన్నూర్ మున్సిపాలిటీ కలిసి రావడం లేదా? అంటే.. అవుననే చెప్పొచ్చు. చెన్నూర్ మున్సిపాలిటీగా ఏర్పడిన ఏడేళ్లలో ఎనిమి ది మంది కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇక్కడికి వచ్చిన కమిషనర్లు ఏడాది కంటే ఎక్కువ కాలం పని చేయకుండానే అర్ధంతరంగా బదిలీ అవుతుండడం గమనార్హం. తరచూ వీరి బదిలీల కారణంగా పాలన గాడి తప్పి, అభివృద్ధి కుంటుపడుతోంది.
అసలేం జరుగుతోంది?
చెన్నూర్ మున్సిపాలిటీ 2 ఆగష్టు 2018న ఏర్పడింది. మరో రెండు నెలలైతే ఏడేళ్లు పూర్తవుతుంది. ఏడేళ్లు పూర్తి కాకుండానే ఎనిమిది మంది కమిషనర్లు మారారు. మున్సిపాలిటీతోనే పట్టణాభివృద్ధి ముడిపడి ఉంది. ఏడాదికి ఒక్కరు చొప్పున కమిషనర్లు మారుతుండడంతో అభివృద్ధి ముందుకు సాగ డం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో విధులు నిర్వహించిన కమిషనర్ మురళీకృష్ణ గతేడాది అక్టోబర్ 27న చెన్నూర్ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 4న మున్సిపాలిటీ పరిధిలోగల పబ్లిక్ మోటర్లకు తాళాలు వేయడంతో పట్టణ ప్రజలతో పాటు అప్పటి పాలకవర్గం నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. నవంబర్ 27న పాలకవర్గానికి సమాచారం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కమిషనర్‌పై అప్పటి పాలకవర్గ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గత జనవరిలో మున్సిపల్ పాలకవర్గ పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పని చేస్తూ పాలనాపరమైన ఇబ్బందులు లేకుండా.. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా మున్సిపల్ కమిషనర్ అభివృద్ధిపై దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ బదిలీ కావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
బదిలీ సహజమా?.. పనిష్మెంటా?
అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్న కమిషనర్ వచ్చి ఎనిమిది నెలలు కాకుండానే బదిలీ కావడాన్ని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది సహజ బదిలీనా.. పనిష్మెంట్ బదిలీనా? అని గుసగుసలాడుతున్నారు. రాను న్న మున్సిపల్ ఎన్నికల్లో సమర్థవంతంగా పని చేసే అధికారి ఉండాలనే ఉద్దేశంతో అధికార పార్టీ నేతలే బదిలీ చేయించారేమో? అనే చర్చసాగుతోంది.
త్వరలోనే కొత్త కమిషనర్
త్వరలోనే చెన్నూర్ మున్సిపల్ కమిషనర్‌గా అంజయ్య బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన చెన్నూర్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే.