
అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలి
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు అర్హులందరికీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఉచిత ఇసుక సరఫరా, భూభారతి రెవె న్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారం, విత్తనా లు, ఎరువుల నిర్వహణ, వనమహోత్సం లక్ష్యసాధన, ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన, సీజన్ వ్యాధుల నివారణ చర్యలు, టీబీ ముక్త్ భార త్ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఇందులో అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటికే మంజూరు పత్రాలు అందించినట్లు చెప్పారు. భారీ వర్షాలు ప్రారంభం కాకముందే లబ్ధిదారులు ఇండ్ల గ్రౌండ్, బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాగుకు అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన మేరకు జిల్లాల వారీగా కేటాయించనున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డెంగీ, మలేరియా, చికున్ గున్యా లాంటి విషజ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల ఆవరణల్లో విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించేలా చూడాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి హరీశ్‌రాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి కిషన్, వ్యవసాయాధికారి కల్పన, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివాజీ పాల్గొన్నారు.