
విద్యార్థులను ఇబ్బంది పెడితే సహించం
● మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ● కేజీబీవీ ఎస్‌వో, సిబ్బందిపై ఆగ్రహం
దండేపల్లి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులను సిబ్బంది ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు హెచ్చరించారు. దండేపల్లి కేజీబీవీలో ఎస్‌వో, కొందరు సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విద్యార్థుల ఫిర్యాదు మేరకు సోమవారం ఆయన డీఈవో యాదయ్యతో కలిసి సందర్శించారు. విద్యార్థులు, సిబ్బందితో వేర్వేరుగా సుమారు రెండు గంటలకు పైగా మాట్లాడారు. విద్యార్థులు తమ గోడు వెల్లబోసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, నాణ్యతగా ఉండడం లేదని, చికెన్, గుడ్డు తక్కువ చేసి పెడుతున్నారని, మరుగుదొడ్లు, మూత్రశాలలు శుభ్రం చేయిస్తున్నారని, గదులు, పరిసరాలు ఊడ్చిపిస్తున్నారని తెలిపారు. దీంతో ఎస్‌వో, సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేసి చర్యలు తీసుకుంటామని డీఈవో తెలిపారు. జిల్లా సెక్టోరియల్ అధికారి సత్యనారాయణమూర్తి, ఎంపీడీవో ప్రసాద్, ఎంఈవో చిన్నయ్య, సీఆర్పీ నర్సయ్య పాల్గొన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం విద్యార్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాల మేరకు డీఈవో, జిల్లా సెక్టోరియల్ అధికారి ఈ నెల 18న విచారణ జరిపా రు. అధికారుల విచారణలో బాధలు చెప్పుకోలేని విద్యార్థులు.. నేరుగా ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిన సిబ్బందిపై వేటుపడే అవకాశముంది.
ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి
లక్సెట్టిపేట: ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించారు. జూలై 3న ఆసుపత్రి భవనం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని, అప్పటివరకు పెండింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ.ఆరీఫ్, పింగిళి రమేష్ తదితరులు పాల్గొన్నారు.