
ఏటీఎంలో చోరీకి యత్నం
● బైక్‌పై వచ్చిన ఏడుగురు అంతర్రాష్ట్ర దొంగలు ● గ్యాస్‌కట్టర్‌తో ఏటీఎం బాక్స్‌ను కట్ చేసిన దుండగులు ● ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బెల్లంపల్లి: పట్టణంలోని కాల్‌టెక్స్ ఏరియాలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో సోమవారం తెల్లవారుజామున అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపింది. టూటౌన్ ఎస్సై కె.మహేందర్ తెలిపిన వివరాల మేరకు కాల్‌టెక్స్ ఏరియాలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో బజాజ్ షోరూం పక్కన ఉన్న ఏటీఎం వద్దకు తెల్లవారు జామున సుమారు 3:15 గంటల ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు బైక్‌లపై వచ్చారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం బాక్స్ దిగువన కొంతమేర కట్ చేశారు. అదే సమయంలో రైల్వేస్టేషన్ ప్రాంతంలో పెట్రోలింగ్‌కు వెళ్లిన బ్లూకోర్ట్ పోలీసులు టూటౌన్ వైపు వస్తుండగా ఏటీఎం షట్టర్ మూసి ఉండటంతో అనుమానం వచ్చి ఆగారు. ఏటీఎం పక్కన రెండు బైక్‌లు పార్కింగ్ చేసి ఉండడం గమనించి వాటి సైలెన్సర్లను చేతితో టచ్ చేయడంతో వేడి సెగ తగిలింది. వెంటనే టూటౌన్ ఎస్సై మహేందర్‌కు సమాచారం అందించారు. అప్పటికే శాంతిఖని బస్తీవైపు పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సై స్టేషన్‌కు వెళ్లి హెడ్ కానిస్టేబుల్‌ను వెంట తీసుకుని వెళ్లమని ఆదేశించారు. ఆ ప్రకారంగానే ఏటీఎం వద్దకు వెళ్లడంతో పోలీసులను గమనించిన దొంగ పక్కనున్న గోడదూకి పారిపోయేందుకు యత్నించాడు. అడ్డుకున్న పోలీసులపై వెంట తెచ్చుకున్న కారం పొడిని చల్లాడు. అయినా పో లీసులు దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు. మి గిలిన దొంగలు అప్పటికే పలాయనం చిత్తగించా రు. కాగా కరీంనగర్ నుంచి ఏటీఎం సిబ్బంది వచ్చి పరిశీలించారు. ఖాళీ బాక్స్ మాత్రమే అపహరణకు గురైనట్లు గుర్తించారు. నగదు చోరీ కాలేదన్నారు.
హర్యానా ముఠా పనేనా?
ఏటీఎంలో చోరీకి యత్నించింది హర్యానాకు చెందిన దొంగల ముఠా సభ్యులేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న దొంగ తనది హర్యానా అని చెప్పడంతో నిందితులంతా ఆప్రాంతానికి చెందిన వారై ఉంటారని భావిస్తున్నారు. పారిపోయిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలంలో గ్యాస్ కట్టర్, గ్యాస్ సిలిండర్, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో ఎన్.దేవయ్య, పలువురు ఎస్సైలు ఘటనాస్థలిని సందర్శించారు.