
బొలెరో ఢీకొని ఒకరు మృతి
బెల్లంపల్లి: పట్టణంలోని గాంధీనగర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు టూటౌన్ ఎస్సై కె.మహేందర్ తెలిపారు. తాండూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒడ్నాల వెంకటేష్ (32) ఆదివారం రాత్రి నడుచుకుంటూ జాతీయ రహదారిని దాటుతుండగా బొలెరో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆటో ఢీకొని మహిళ..
జన్నారం: బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరిన మహిళను ఆటో రూపంలో మృత్యువు కబళించింది. ఎస్సై గొల్లపెల్లి అనూష తెలిపిన వివరాల మేరకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లింగపూర్‌కు చెందిన ఉప్పల్‌వార్ వనిత (హేమలత) (35) మూడు రోజుల క్రితం తన తల్లి కస్తూలపూరి గంగాలక్ష్మీ ఇంటికి వచ్చింది. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి కలమడుగులోని బంధువుల ఇంటికి వెళ్లింది. కలమడుగు నుంచి రేండ్లగూడ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో అతివేగంగా ఢీకొట్టింది. వనితకు తీవ్రగాయాలుకాగా తల్లి గంగాలక్ష్మీకి కాలు, విరిగింది. క్షతగాత్రులను అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించగా చికిత్స పొందుతూ వనిత రాత్రి మృతి చెందింది. మృతురాలి సోదరుడు నరేశ్ ఫిర్యాదు మేరకు ఘటనకు కారణమైన ఆటోడ్రైవర్ హన్మండ్ల సత్తన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
మొబైల్ షాపులో చోరీ
సాత్నాల: బోరజ్ మండలం కేంద్రంలోని చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు శ్యామ్ ఆన్‌లైన్ మొబైల్ షాపు షటర్ పగులగొట్టి రూ.30వేలు అపహరించినట్లు ఎస్సై గౌతమ్ తెలి పారు. సోమవారం ఉదయం శ్యామ్ తన దు కాణానికి వెళ్లగా షట్టర్ పగులగొట్టి ఉండడంతో పో లీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడికి గాయాలు
కాసిపేట: కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధి లోని జాతీయ రహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో ఎరుకల వెంకటేశ్వర్లు అనే సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. సోమగూడెంకు చెందిన వెంకటేశ్వర్లు స్కూటీపై బెల్లంపల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కుడికాలు తెగిపోయింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈవిషయమై కాసిపేట ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌ను వివరణ కోరగా కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందలేదన్నారు.
పాఠశాల బస్సు డ్రైవర్‌కు జైలు
తాండూర్: సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో సోమవారం రాంనగర్, ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సమయంలో అచ్చలాపూర్ నుంచి రేపల్లెవాడ వైపు వెళ్తున్న సెయింట్ థెరిస్సా పాఠశాల బస్సును ఆపి డ్రైవర్ తోట సత్యనారాయణకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి బెల్లంపల్లి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా నాలుగు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ తెలిపారు.

బొలెరో ఢీకొని ఒకరు మృతి