
చిరుత కాదు బెబ్బులి..
● రఘునాథ్‌పూర్ అడవుల్లో సంచారం ● ట్రాప్ కెమెరాకు చిక్కిన పులి ● సమీప గ్రామాల్లో హైఅలర్ట్
బోథ్: బోథ్ అడవుల్లో బెబ్బులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వారం రోజులుగా బోథ్ మండలంలోని కంటెగాం, నిగిని, మర్లపెల్లి, నారాయణపూర్, రఘునాఽథ్‌పూర్ గ్రామాల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. వారం క్రితమే కంటెగాం చెరువు సమీపంలో ఓ ఆవును, ఈ నెల 19న రఘునాథ్‌పూర్ అటవీ ప్రాంతంలో ఓ లేగదూడను హతమార్చింది. అయితే తొలుత చిరుతగా భావించిన అధికారులు అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ట్రాప్ కెమెరాలో పెద్దపులి కనిపించడంతో అప్రమత్తమయ్యారు.
అడెల్లి దారిలో అలర్ట్
పులి సంచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధన్నూర్, రఘునాథ్‌పూర్ మీదుగా అడెల్లి, సారంగాపూర్ వెళ్లేవారు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రఘునాథ్‌పూర్ వద్ద గల గుట్ట వెనక నుంచి నారాయణపూర్, అడెల్లి, మర్లపెల్లి, నిగిని, కంటెగాం అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు సోమవారం రఘునాథ్‌పూర్, నారాయణపూర్ గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులను అలర్ట్ చేశారు. గ్రామస్తులెవరూ అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. చిన్నారులు, వృద్ధులు అటవీ ప్రాంతంలోని చేలలోకి వెళ్లవద్దన్నారు. కాగా బోథ్ అడవుల్లో పులి సంచారం ఏడాదిలో ఇది రెండవసారి. గతేడాది అక్టోబర్‌లో సంచరించిన పులి మళ్లీ జూన్‌లో బోథ్ మండలానికి వచ్చింది.
తిప్పేశ్వర్ నుంచి రాక..
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి పెద్దపులులు తరచూ వచ్చి వెళ్తున్నాయి. తాజాగా తిప్పేశ్వర్ నుంచే బోథ్ అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో చింతల్‌బోరి, వజ్జర్, గొల్లాపూర్, చింతగూడ, నేరుడుపల్లె నుంచి నిగిని మీదుగా సారంగాపూర్, అడెల్లి ప్రాంతాల్లో పులి సంచరించి కవ్వాల్ అటవీ ప్రాంతానికి వెళ్లింది. ప్రస్తుతం కూడా అడెల్లి నుంచి కవ్వాల్ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.