
అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుల అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని టేకంగర్ జిల్లాకు చెందిన సౌరభ్ రాయక్వార్, రితిక్‌సేన్ వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారన్నారు. వర్క్‌ఫ్రం హో ం అంటూ రోజుకు రూ.2 వేల నుంచి రూ.8 వేల వరకు సంపాదించవచ్చని అమాయకులను బురిడీ కొట్టిస్తున్నట్లు తెలిపారు. హాయ్ నాపేరు టీనా.. అంటూ వాట్సాప్‌లో పరిచయం.. టెలీగ్రామ్‌లో టాస్క్‌లు పంపుతూ అధిక డబ్బు ఆశ చూపుతూ ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని జందాపూర్‌కు చెందిన చెన్న శివకుమార్ నుంచి రూ.5 లక్షల 3వేల వరకు వసూలు చేశారన్నారు. ఈనెల 14న బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగతా ముఠా సభ్యులను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సదరు నిందితులు 25 వాట్సాప్ గ్రూప్‌లను నడుపుతున్నారని, ఇందులో 250 మంది సభ్యులు ఉన్నారన్నారు. నెలకు రూ.30 లక్షల వరకు ట్రాన్సెక్షన్ చేశారన్నారు. దాదాపు 900 మందిని మోసం చేసినట్లు గుర్తించామన్నారు. వీరికి సంబంధించిన సైబర్ మోసగాళ్లు విదేశాల్లో ఉంటూ ఏజెంట్ల ద్వారా అమాయకులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలియని వెబ్‌సైట్లు, లింక్‌లను ఓపెన్ చేయవద్దని ఎస్పీ సూచించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, రూరల్ సీఐ ఫణిధర్, ఎస్సై విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్