
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: మంచిర్యాల–పెద్దంపేట రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మృతుడు మంచిర్యాలలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన వానరాసి మల్లేశ్ (37)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో భద్రపర్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఒకరిపై దాడి
తానూరు: మండలంలోని జౌలా(కే) గ్రామానికి చెందిన ఇప్తెకర్ సిద్ధిరాంపై అదే గ్రామానికి చెందిన కొందరు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు ట్రైయినీ ఎస్సై నవనీత్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గతవారం క్రితం అదే గ్రామానికి చెందిన ప్రదీప్, సిద్ధిరాంలు ఫోన్ విషయమై మద్యం మత్తులో గొడవపడ్డారు. మాటమాట పెరిగి సిద్ధిరాం ప్రదీప్‌ని కర్రతో కొట్టి అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ప్రదీప్ తన సోదరులకు తెలిపాడు. ప్రదీప్ సోదరులు సిద్ధిరాం రాక కోసం ఎదురుచూశారు. అతను శనివారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. ప్రదీప్ సోదరులు, కుటుంబ సభ్యులు అతన్ని హత్య చేయాలనే పథకం పన్ని కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలైన సిద్ధిరాంను కుటుంబ సభ్యులు భైంసా ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. విషయం తెలుసుకున్న భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆదివారం జౌలా(కే) గ్రామానికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. సిద్ధిరాం ఫిర్యాదు మేరకు ఘటనపై పూర్తిస్థాయిలో విచరణ చేపట్టి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ట్రైయినీ ఎస్సైకి సూచించారు.
పశువులు పట్టివేత
కౌటాల: మండలంలోని హెట్టి గ్రామం నుంచి అక్రమంగా వాహనాల్లో తరలిస్తున్న పశువులను ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు. శనివారం రాత్రి హెట్టి నుంచి మూడు బొలెరో వాహనాల్లో 18 ఆవులు, 10 దూడలు, 4 ఎద్దులను అక్రమంగా త రలిస్తుండగా పట్టుకున్నామని పేర్కొన్నారు. మూడు బొలెరో వాహనాలు, రెండు కార్లను సీజ్ చేసి పట్టుకున్న 32 పశువులను కౌటాల బంజారు దొడ్డిలో ఉంచినట్లు తెలిపారు. పశువులను అక్రమంగా తరలిస్తున్న షేక్ శుజాఉద్దీన్, అయుబ్‌ఖాన్, హలీద్ పాషా, జమీర్, మొబీన్, రఫీ, ఫాషీ, అహ్మద్, అబ్దుల్లా, జహీర్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
అదుపుతప్పిన కారు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాకేంద్రంలోని గుల్జార్ మార్కెట్‌లో ఆదివారం కారు అదుపుతప్పిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. ఓ కారు పోలీస్‌స్టేషన్ వైపు నుంచి మార్కెట్ వైపు వస్తూ మసీదు ఎదుట ఉన్న రెండు బజ్జీల బండ్లు, ఒక బైక్‌ను ఢీకొంది. ఘటనలో కారుడ్రైవర్ శ్రీధర్‌తోపాటు గౌస్‌ఖాన్‌కు గాయాలయ్యాయి. షేక్ అహ్మద్‌పై వేడి నూనె పడి గాయపడ్డారు. అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య