
మాస్క్ ధరించి.. బంగారం అపహరించి
● భైంసాలోని ఓ ఇంట్లో 31 తులాలు చోరీ
భైంసాటౌన్: పట్టణంలోని రాహుల్‌నగర్‌లో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బాధితులు, పట్టణ సీఐ జి.గోపినాథ్ కథనం ప్రకారం.. రాహుల్‌నగర్‌లోని నివాసముంటున్న మచ్చ గజ్జారాం, పంచపూల దంపతులు శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి నర్సాపూర్(జి)లోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆదివారం ఇంటి గేటు, తలుపులు తెరిచి ఉండడం గమనించిన స్థానికులు వారి కుమారుడికి సమాచారమిచ్చారు. ఆయన వెంటనే నర్సాపూర్(జి)లో ఉన్న తల్లిదండ్రులకు తెలిపి, భార్యతో కలిసి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. లోనికి వెళ్లి వెళ్లి చూడగా బీరువా, వస్తువులు చిందరవందరగా ఉండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ జి. గోపీనాథ్, ఎస్సై గౌసుద్దీన్ చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనలో 31 తులాల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు, ఒక ప్రొఫెషనల్ కెమెరా అపహరణకు గురైనట్లు పేర్కొన్నారు. ఇంట్లో సీసీ పుటేజీ పరిశీలించగా మాస్క్ ధరించిన ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.