
డయేరియాపై సమరం
● జూలై 31 వరకు కార్యక్రమాలు
● ఐదేళ్లలోపు చిన్నారులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్లు పంపిణీ
● అతిసారను అడ్డుకోవడమే లక్ష్యం
లక్షణాలు..
డయేరియా సోకినప్పుడు విరేచనాలతోపాటు జ్వరం, వాంతులు, దాహం ఎక్కువ కావడం, నీరసం, గుండెదడ, నోరు ఎండిపోవడం, చర్మం పొడిబారడం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో డీహైడ్రేషన్ ఎక్కువైతే నాడీ వేగం తగ్గి, కోలుకోవడం కష్టంగా మారుతుంది. వెంటనే వైద్యుల వద్దకు వెళ్తే శరీరం కోల్పోయిన లవణాలు రీప్లేస్ చేసేందుకు గ్లూకోజ్, ఓఆర్‌ఎస్, కొబ్బరినీళ్లు ఇవ్వడంతో పాటు, విరేచనాలతోపాటు వాంతులు ఉంటే సైలెన్ ఎక్కిస్తారు. తగినంత విశ్రాంతి తీసుకుంటూ మందులు వాడితే వాంతులు, విరేచనాలు తగ్గి వ్యాధి నుంచి బయటపడతారు. వ్యాధిగ్రస్తులు తేలి కగా జీర్ణమయ్యే వాటిని తినడం, పాల పదార్థాలను తగ్గించి, పండ్ల రసాలు, సూప్‌లు ఎక్కువగా తీసుకోవడం, పుల్లటి పండ్లు తినకుండా ఉంటే మంచిది.
మంచిర్యాలటౌన్: డయేరియా నిర్మూలనకు వైద్య ఆరోగ్యశాఖ నడుం బిగించింది. ఐదేళ్లలోపు చిన్నారులు వందమంది మృతి చెందితే.. అందులో 4.8 శాతం మంది డయేరియాతో ప్రాణాలు కోల్పోతు న్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టాప్ డయేరియా క్యాంపెయిన్(అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం)ను చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి జూలై 31 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డయేరియా రావడానికి ప్రధాన కారణం కలుషితమైన తాగునీటిని తీసుకోవడ మే. వర్షాల సమయంలో పైపులైన్లు పగలడం, ట్యాంకుల్లో కలుషిత నీరు చేరడం, తాగేనీటితో పాటు తినే ఆహారం కలుషితమైనా, వ్యక్తిగత పరిశుభ్రత లేకున్నా సోకుతుంది. పసిపిల్లల నుంచి పెద్దలకు అందరికీ వచ్చే సాధారణ వ్యాధి. నీళ్ల విరేచనా లు అయితే నార్మల్ డయేరియాగా, రక్తం, బంకతో వచ్చే విరేచనాలను డిసెంట్రీగా పిలుస్తారు. పిల్లల్లో వచ్చే ఈ వ్యాధికి రోటా వైరస్ కారణమైతే.. నోరో వైరస్‌లతో పెద్దలకు సోకుతుంది. రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టిరీయా, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, ఫుడ్ పాయిజనింగ్ కూడా డయేరి యాకు దారి తీస్తాయని వైద్యులు చెబుతున్నారు. బాధితుల శరీరంలో నీటిశాతం, లవణాలు తగ్గి పోయి నీరసంగా తయారవుతారు. సరిపడా లవణాలు అందించకుంటే డీహైడ్రేషన్ ఎక్కువై పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఒంట్లోని పోషకాలు, లవణాలన్నీ విరేచనాలతో బయటకు వెళ్లి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే లక్షణాలను వెంటనే గుర్తించి ఓఆర్‌ఎస్ నీటిలో కలుపుకుని తాగడం, జింక్ ట్యాబెట్లు వేసుకోవడం ద్వారా తీవ్రతను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.
ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్న కేంద్రాలు
అంగన్‌వాడీ కేంద్రాలు 969
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 17
అర్బన్ హెల్త్ సెంటర్లు 5
సబ్‌సెంటర్లు 149
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి 1