
● మిల్లర్ల ఖాయిలపై కఠినతరం ● రంగంలోకి ఈడీ దిగే అవకాశం ●
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) బకాయిలపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సీఎంఆర్ బకాయిల రికవరీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా సీజన్లలో ధాన్యం తీసుకుని సకాలంలో పౌరసరఫరాల శాఖకు బియ్యం ఇవ్వని మిల్లర్లను డీఫాల్టర్లుగా ప్రకటించారు. అంతేకాకుండా గత వానాకాలం నుంచే జిల్లాలో అనేక మంది మిల్లర్లు సీఎంఆర్‌కు దూరమయ్యారు. బియ్యం ఇవ్వకుండా పలుమార్లు నోటీసులు, అధికారులకు స్పందించని వారిపై రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్) యాక్టు కింద కేసులు నమోదయ్యాయి. కొంతమందిపై ఆర్‌ఆర్‌యాక్టుతో పాటు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా జిల్లాలో 20 మందికి పైగా కేసులు నమోదు చేశారు. మొదట కేసులు నమోదు చేసే సమయంలోనే రూ.133 కోట్ల బకాయిలు ఉన్నట్లు తేల్చారు. ధాన్యం విలువకు వడ్డీతో సహా లెక్కగట్టి వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌యాక్టు అమలు చేసేందుకు మిల్లర్ల చర, స్థిర ఆస్తుల వివరాలు సైతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది ఈ యాసంగి సీజన్ ఆరంభంలోనే మళ్లీ మిల్లు ట్యాగింగ్ పొందేందుకు చెల్లిస్తున్నారు. ఇక 2022–23 యాక్షన్ ధాన్యానికి సంబంఽధించిన బకాయిలపైనా రికవరీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మిల్లర్లు గతేడాది రెండు సీజన్ల సీఎంఆర్ కింద బియ్యం అప్పగిస్తున్నారు.
పొరుగు జిల్లాలకే అధికం
స్థానికంగానే ధాన్యం ఇచ్చేందుకు మిల్లులకు అవకాశం ఉన్నా బకాయిల కారణంగా గత రెండు సీజన్లలోనూ ట్యాగింగ్‌కు దూరమయ్యాయి. ఈ యాసంగిలో జిల్లాలోని 22 మిల్లులకే అవకాశం ఇచ్చారు. ఇక పొరుగు జిల్లాలైన కరీంనగర్‌లోని 68 మిల్లులకు, పెద్దపల్లిలోని 110 మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చారు. మొత్తంగా ఈ సీజన్‌లో 1.99 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లులకు అప్పగించారు. అయితే ఈ ధాన్యం ఇచ్చేందుకు కూడా గత వానాకాలం నుంచి బ్యాంకు గ్యారెంటీలు తప్పనిసరి చేశారు. ధాన్యం విలువలో కనీసం పదిశాతం బ్యాంకు గ్యారెంటీ తీసుకున్నారు. గత సీజన్‌లో ఇంకా బకాయి ఉంటే 20 శాతం వరకు ఇవ్వాల్సిరావడంతో బకాయిలు ఉన్న స్థానిక మిల్లులకు ధాన్యం ఇవ్వడం నిలిచిపోయింది.
రంగంలోకి ఈడీ?
సీఎంఆర్‌కు సంబంధించిన ధాన్యం బకాయిలు రూ.కోట్లలో ఉన్న మిల్లులపై ఇప్పటికే పలు రకాలుగా చట్టప్రకారం ముందుకు వెళ్తుండగా ఇక ఈడీ (డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) సైతం రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిల్లర్లు ధాన్యం పక్కదారి పట్టించి జరిపిన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రూ.వందల కోట్లలో ఉన్న బకాయిలపై కఠినంగా వ్యవహరించాలని పౌరసరఫరాల శాఖ యోచిస్తున్న నేపథ్యంలో కఠిన చర్యలు తప్పేలా లేవు. దీంతో ఆర్థిక లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ మొదలుపెడితే తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ధాన్యం అమ్మడం నుంచి ఆ మొత్తంతో ఇతర ఆస్తులు కొనుగోలు చేసి పెట్టుబడులు జరిపిన నగదు మళ్లింపు, ఇతర క్రయ విక్రయాలన్నింటిని విచారణ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈడీ దర్యాప్తు మొదలైతే జిల్లాలోనూ పెద్దమొత్తంలో బకాయిలు ఉన్న మిల్లర్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
జిల్లాలో సీఎంఆర్ వివరాలు (టన్నుల్లో)
సంవత్సరం సీజన్ లక్ష్యం పెండింగ్
2023–24 రబీ 57,832 9,199.870
2024–25 ఖరీఫ్ 53,689 21,424.680
2024–25 రబీ 59,958 55,047.190

● మిల్లర్ల ఖాయిలపై కఠినతరం ● రంగంలోకి ఈడీ దిగే అవకాశం ●