
దేశానికి కమ్యూనిస్టులు అవసరం
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబశివరావు ● ముగిసిన సీపీఐ జిల్లా నాలుగో మహాసభ
పాతమంచిర్యాల: దేశానికి, సమాజానికి కమ్యూనిస్టుల అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన సీపీఐ జిల్లా నాలుగో మహాసభ ముగింపు సమావేశానికి హాజరై మాట్లాడారు. దేశంలో అసంఘటిత రంగాల్లో కోటిమంది ఉన్నారని, వారి కోసం కమ్యూనిస్టు పార్టీ ఉంటుందన్నారు. సామ్రాజ్యవాద దేశాల కనుసన్నల్లోనే మన దేశంలో పరిపాలన సాగుతుందని విమర్శించారు. 2026 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. దేశంలో నిరుద్యోగం, అవినీతి, అసమానతలు, పేదరికం లేకుండా చేస్తామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు, ఆదివాసీలను అమానుషంగా చిత్రహింసలకు గురిచేసి చంపుతున్నారని ఆరోపించారు. ఆంతకుముందు సమావేశ ప్రాంగణం ఆవరణలో ఏర్పాటు చేసిన అరుణ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద ఇటీవల అమరులైన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నంబాల కేశవరావు, గాదర్ల రవి, భాస్కర్‌తోపాటు పార్టీ సభ్యులకు నివాళులర్పించారు. విమాన ప్రమాదంతోపాటు పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కోసం మౌనం పాటించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, నాయకులు మిట్టపల్లి వెంకటస్వామి, ఖలిందర్ అలీఖాన్, పౌలు, లింగం రవి, మిరియాల రాజేశ్వర్‌రావు, బొల్లం పూర్ణిమ, రేగుంట చంద్రకళ, బొల్లం తిలక్, వనం సత్యనారాయణ, ఇప్పకాయల లింగయ్య పాల్గొన్నారు.
జిల్లా కార్యవర్గం ఎన్నిక
సీపీఐ జిల్లా నాలుగో మహాసభల సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, కార్యవర్గ సభ్యులుగా 16 మంది, కౌన్సిల్ సభ్యులుగా 51 మందిని ఎన్నుకున్నారు. కాగా, రామడుగు లక్ష్మణ్ ఇప్పటికే జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు.