
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామ పంచాయతీలో 60 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు భూమి పూజ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలైన నాగారం, ర్యాలీ, చిన్నగోపాల్‌పూర్‌తోపాటు గఢ్‌పూర్ గ్రామాల పరిధిలోని అర్హులకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేలా చూస్తామని అన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అంతకు ముందు గిరిజనులు మంగళహారతులు, సంప్రదాయ నృత్యాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీవో గూడూరు శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాసరావు దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.