
అడవి అలుగు స్వాధీనం
ఖానాపూర్: వేటగాళ్ల ఉచ్చుకు చిక్కిన అడవి అలుగును అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 19న అడవి అలుగును వేటాడి క్రయ, విక్రయాలు చేస్తున్న ముఠా సంచరిస్తున్న సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే విచారణ చేపట్టి 8 మందిపై కేసు నమోదు చేశారు. ఈక్రమంలో వేటాడి పట్టుకున్న అలుగును అటవీశాఖ కార్యాలయం వెనుకభాగంలో వదిలివెళ్లినట్లు నిందితులు వెల్లడించినట్లు సమాచారం. శుక్రవారం అధికారులు.. అలుగును వదిలివెళ్లిన ప్రాంతంలోని నివాసాల్లో గాలించినా దొరలేదు. కాగా, ఇదివరకు అలుగును దాచినవారు తమపై కేసులు నమోదవుతాయనే భయంతో శనివారం ఉదయం ఫారెస్ట్ కార్యాలయం వెనుక భాగంలో వదిలివెళ్లారు. దీంతో అధికారులు అలుగును స్వాధీనం చేసుకున్నారు. కాగా, కేసు పూర్తి వివరాలను ఆదివారం వెల్లడించనున్నట్లు ఎఫ్‌ఆర్వో కిరణ్ తెలిపారు.
రెడ్ జట్టుపై యెల్లో జట్టు విజయం
మంచిర్యాలటౌన్: ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడిపేట్ బెటాలియన్‌లో శనివారం జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలను కమాండెంట్ వెంకటరాములు ప్రారంభించారు. యెల్లో, రెడ్ జట్లు 50 ఓవర్ల మ్యాచ్‌లో పాల్గొనగా, మొదట యెల్లో జట్టు బ్యాటింగ్ చేసి 18.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 75 పరుగులు మాత్రమే చేసింది. ఆ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన దర్శ్ అగర్వాల్ 80, ఎండీ అద్నాన్ 33 రన్స్ చేయడంతో 44.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్‌కు దిగిన రెడ్ జట్లు 50 ఓవర్లలో 179 పరుగులు చేసి ఓటమి పాలైంది. యెల్లో జట్టు బౌలర్లలో జి.చరణ్, డి.లక్ష్మణ్ మూడు వికెట్ల చొప్పున, రెడ్ జట్టు బౌలర్ జాదవ్ రాజ్, ఎండీ అనస్‌లు 4 వికెట్ల చొప్పున తీశారు.
ఆటోబోల్తా
కడెం: మండలంలోని అంబారిపేట్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాలు.. మండలంలోని పెద్దూర్‌కు చెందిన వర్దెల్లి రాజేందర్(రాయమల్లు), వర్దెల్లి మల్లేశ్, గుండారపు కృష్ణ ఆటోలో దస్తురాబాద్ నుంచి కడెం వైపు వస్తున్నారు. అంబారిపేట్ సమీపంలోని బ్రిడ్జి మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని 108లో ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రాజేందర్ పరిస్థితి విషమించి మృతిచెందాడు. మల్లేశ్, కృష్ణను మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు.

అడవి అలుగు స్వాధీనం

అడవి అలుగు స్వాధీనం

అడవి అలుగు స్వాధీనం