
మహారాష్ట్ర నుంచి తరలిస్తున్న గంజాయి పట్టివేత
బెల్లంపల్లి: మహారాష్ట్రలో కొనుగోలు చేసి అక్రమంగా బెల్లంపల్లికి తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకుని, ఆటోడ్రైవర్‌ను అరెస్టు చేశారు. బెల్లంపల్లి రూరల్‌సీఐ అఫ్జలుద్దిన్ కథనం ప్రకారం..బెల్లంపల్లి కాల్‌టెక్స్ ఏరియాకు చెందిన ఆటోడ్రైవర్ ఎస్.కే ముజ్జు మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఆర్టీసీ బస్సులో వస్తున్నట్లు తెలుసుకుని కాల్‌టెక్స్ రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి మీద మాటువేశారు. ముజ్జు బస్సు దిగగానే టూటౌన్ ఎస్సై మహేందర్, పోలీసులు శనివారం తనిఖీ చేశారు. బ్యాగ్‌లో కిలో 78 గ్రాముల గంజాయి లభించింది. దీని విలువ రూ.26,950 ఉంటుందని అంచనా వేశారు. సదరు గంజాయిని స్వాధీనం చేసుకుని పంచనామా చేశారు. నిందితుడిపై టూటౌన్‌లో కేసు నమోదు చేసి కోర్టుకు పంపించినట్లు సీఐ పేర్కొన్నారు.