
ఢిల్లీలో శిక్షణకు నిర్మల్ ఉపాధ్యాయుడు
నిర్మల్‌ఖిల్లా/లోకేశ్వరం: జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలకనుగుణంగా విద్యార్థుల్లో సృజనాత్మక సామర్థ్యాలను పెంపొందించేందుకు దోహదపడే ‘‘కళలు(తోలుబొమ్మలాట)–వాటి పాత్ర’’ అనే అంశంపై ఢిల్లీలో జరిగే శిక్షణ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ఎంపికయ్యారు. లోకేశ్వరం మండలం సేవాలాల్ తాండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్మల ప్రవీణ్‌కుమార్ శిక్షణకు హాజరుకానున్నారు. ఇదివరకే జిల్లా నుంచి ఉత్తమ బోధనా విధానాల అమలులో రాష్ట్రస్థాయికి ఎంపికై తన బెస్ట్ ప్రాక్టీసెస్‌ను గత ఏప్రిల్‌లో హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఎంఈవోల ఎదుట ప్రదర్శన ఇచ్చారు. జూలై 3 నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఎంపికచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రవీణ్‌కుమార్ ఒక్కరే ఎంపికయ్యారు. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్ ఉత్తర్వులు వెలువరించారు. విద్యార్థులకు అర్థమయ్యే సృజనాత్మక అభ్యసన ప్రక్రియలో భాగంగా తోలుబొమ్మలాట, సాహిత్యం, నాటకం వంటి కళారూపాలను మిళితం చేసి విద్యార్థుల్లో కృత్యాధార సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా శిక్షణ ఇవ్వనున్నారు.