తేమ లేకుండానే విత్తనం
● ఖరీఫ్ పనులు ముమ్మరం ● పొడి దుక్కిలోనే విత్తనాలు వేస్తున్న రైతులు ● అదును దాటుతోందని ఆందోళన
మంచిర్యాలఅగ్రికల్చర్: రుతుపవనాలు వచ్చినా తొలకరి వర్షాలు పలకరించనేలేదు. ఈనెల 8న ఆదివారం మృగశిర కార్తె (మిరుగు) ప్రారంభం కావడంతో రైతులు ఖరీఫ్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్తె వ్యవసాయ పనులకు శుభసూచకంగా భావించి విత్తనాలు వేస్తున్నారు. ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైన రైతులు చేలల్లో పత్తి విత్తనాలు వేస్తూ.. దుక్కులు దున్నుతూ.. సేంద్రియ ఎరువులు వేస్తూ కనిపిస్తున్నారు. వ్యవసాయ సామగ్రి, విత్తనాలు సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. భూమిలో తేమ లేకున్నా పొడిదుక్కిలోనే విత్తనాలు వేస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే మొలక వచ్చే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు కురిస్తే విత్తనం భూమిలో మురిగిపోయే ప్రమాదం ఉంది. వాతావరణ శాఖ జూన్ నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు నైరుతి కాలంగా వర్షపాతాన్ని లెక్కించడం ప్రారంభిస్తుంది. జూన్ 1 నుంచి 15 వరకు జిల్లా సగటున సాధారణ వర్షపాతం 62.7 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 24.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటున 62 శాతం లోటుగా నమోదైంది. కొద్ది రోజులుగా మబ్బులు పడుతూ చిరుజల్లులకే పరిమితం అవుతోంది. ఒకటి రెండు భారీ వర్షాలు కురిసి నేలలో 60 నుంచి 70 శాతం తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేసుకోవాలని కేవీకే శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
పొడిలోనే విత్తనం..
ఈ ఏడాది రుతుపవనాలు ప్రవేశించినా ఆశించిన భారీ వర్షాలు కురియలేదు. గత నెలలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు రైతులు వ్యవసాయ పనులు వేగవంతం చేశారు. కానీ జూన్‌లో వర్షాలు కురియడం లేదు. వానాకాలం సాగు పంటలు విత్తుకునేందుకు మిరుగు కార్తె ప్రారంభంగా భావించి వానలు పడుతాయనే ఆశతో రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారు. గతేడాది కూడా ప్రథమార్థంలో వర్షాలు కురిసినా.. తర్వాత పంట ఎదిగే సమయంలో ముఖం చాటేయడంతో ఆశించిన దిగుబడి రాక రైతులు నష్టపోయారు. ఈసారి కూడా నైరుతి రుతుపవానాలు ముందుస్తుగానే వచ్చినా ఇంకా వర్షాలు రాకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.
3,33,565 ఎకరాల్లో సాగు అంచనా
జిల్లాలో ఈ ఏడాది పత్తి 1,58,753 ఎకరాలు, వరి 1,58,161, కందులు 1,054, మొక్కజొన్న 531, పెసలు 116, మినము 69 ఎకరాలు, ఇతర పంటలు 14,881, మొత్తం 3,33,565 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువుల ప్రణాళిక రూపొందించారు. గతేడాది పత్తికి మద్దతు ధర రూ.7,521 ఉండగా ఈ ఏడాది రూ.8,110 చెల్లించాలని నిర్ణయించారు. రూ.589 మద్దతు ధర పెరగడంతో ఈ ఏడాది రైతులు ఎక్కువగా పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. కాగా పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి పత్తి సాగు చేస్తుండగా ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ ఖరీఫ్ రైతులకు కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సమయం ఉంది..
ఈ నెల 15 నుంచి జూలై 15 వరకు పత్తి విత్తనాలు విత్తుకోవచ్చు. ప్రస్తుతం నేలలో వేడిఎక్కువగా ఉండడం వలన విత్తనం చెడిపోయే ప్రమాదం ఉంది. భారీ వర్షాలు కురిసి నేలలో ఫీట్ లోపలి వరకు నీరుచేరి 60 నుంచి 70 శాతం తేమ ఉంటే విత్తనం వేసుకోవచ్చు. తేలికపాటి వర్షాలకు తొందరపడి విత్తనం వేసుకుంటే మొలక దెబ్బతినే ప్రమాదం ఉంది.
– రాజశేఖర్, కేవికే శాస్త్రవేత్త, ఆదిలాబాద్
తేమ లేకుండానే విత్తనం


