నాన్నే నాకు హీరో..
జైనథ్: ‘మాది జైనథ్ మండలంలోని కూర గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి మా నాన్న అల్లూరి నర్సింగ్‌రెడ్డి నన్ను, మా చెల్లె రిచాను ఎంతో కష్టపడి చదివించారు. ఎంత కష్టం వచ్చినా వ్యవసాయం మానుకోలేదు. అహర్నిశలు శ్రమిస్తూ మమ్మల్ని ఉన్నత చదువులు చదివించారు. సాధారణ రైతు అయినప్పటికీ చదువు విలువ తెలిసి ఆయన నాకు చదువు ప్రాముఖ్యత తెలియజేస్తూ ప్రోత్సహించాడు. నేను ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. 2021లో కానిస్టేబుల్ ఉద్యోగం మూడు మార్కుల తేడాతో చేజారినప్పటికీ కుంగిపోలేదు. నాన్న ఇచ్చిన ఽధైర్యంతో 2023లో మరోసారి ప్రయత్నించి సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం భీంపూర్ మండలంలోని పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాను. మమ్మల్ని ఇంతటివారిని చేసిన నాన్నే నాకు హీరో..’ అంటున్నాడు అఖిల్‌రెడ్డి


