
పుష్కర మార్గంలో ఫుల్ ట్రాఫిక్!
● కాళేశ్వరం దారిలో పెరిగిన వాహనాలు..
● భీమారం సమీపంలో నాలుగు గంటలు నిలిచిన వాహనాలు
భీమారం: కాళేశ్వరం సమీపంలో నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలకు భారీగా భక్తులు తరలివెళ్లారు. ఈ క్రమంలో మంచిర్యాల–చెన్నూరు జాతీయ రహదారి 63పై భీమారం సమీపంలోని జోడువాగు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వంతెన కారణంగా ఉదయం 11 గంటల నుంచి దాదాపు నాలుగు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వందలాది వాహనాలు రహదారిపై నిలిచిపోయి, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. చెన్నూరు, మంచిర్యాల నుంచి వచ్చే వాహనాలు ఒకేసారి ఇరుకు వంతెనపైకి చేరడంతో ఈ పరిస్థితి తలెత్తింది. భీమారం, కిష్టంపేట వైపు వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.
పుష్కరాలతో పెరిగిన రద్దీ
సరస్వతి పుష్కరాలు సోమవారం ముగియనున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కరీంనగర్ మార్గంగుండా వచ్చిన భక్తులు, ఈసారి పుష్కర నిర్వాహకుల సూచనల మేరకు చెన్నూరు మీదుగా రావడంతో జాతీయ రహదారిపై వాహన రద్దీ గణనీయంగా పెరిగింది. జోడువాగు వద్ద సింగిల్ రోడ్డు, ఇరుకు వంతెన గురించి తెలియక వాహనాలు చొచ్చుకొచ్చాయని పోలీసులు తెలిపారు.
పోలీసుల అలర్ట్..
ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేసేందుకు ఎస్సై శ్వేత నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగారు. నాలుగు గంటలపాటు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ జోడువాగు ప్రాంతాన్ని సందర్శించి, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. జోడు వాగుల వద్ద సింగిల్ రోడ్డు, ఇరుకు వంతెన కారణంగా ట్రాఫిక్ జామ్ అయిందని డీసీపీ తెలిపారు.