
అటవీ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయండి
మంచిర్యాలఅగ్రికల్చర్:వేమనపల్లి మండలం చామనపల్లికి చెందిన ఎస్సీ, ఎస్టీ రైతులపై అక్రమ కేసులు పెట్టిన అటవీ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్ పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశించారు. బాధితులు ప్రజావాణిలో సోమవారం కలెక్టర్‌ను కలిసి అటవీ అధికారులు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 65, 67లోని భూములు ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం 1997లో సర్వే చేసి ఫైనల్ పట్టా జారీ చేసిందని, తెలంగాణ ప్రభుత్వం కొత్త పట్టా పాసుపుస్తకాలు జారీ చేసిందని వివరించారు. ఈ భూముల్లో బోరుబావులు తవ్వుకోవడం, విద్యుత్‌లైన్ కూడా వచ్చిందని మోటర్లు కూడా బిగించుకోవడం జరిగిందని తెలిపారు. అటవీ శాఖ అధికారులు ఈ భూముల్లో సాగు చేయద్దని 9 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్, తహసీల్దార్‌కు, అటవీ అధికారులకు విన్నవించామన్నారు. అయినా అటవీశాఖ అధికారులు దాడులు ఆగడం లేదని వాపోయారు. పట్టాపాస్ పుస్తకాలు చేతపట్టుకుని న్యాయం చేయాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. స్పందించి కలెక్టర్ పోలీసు అధికారులకు ఫోన్ చేసి అటవీ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
● పోలీసులను ఆదేశించిన మంచిర్యాల కలెక్టర్