
నీటి కుంటల వద్ద ఉప్పు గడ్డలను చప్పరిస్తున్న నీల్గాయిలు
అక్కడ ఒకలా.. ఇక్కడ మరోలా..
కవ్వాల్, అమ్రబాద్‌లో పెరుగుతున్న జీవజాలం
సత్పలితాలిస్తున్న అటవీ శాఖ ప్రత్యేక చర్యలు
గోదావరి, మంజీర తీరాల్లో ప్రమాదంలో జీవవైవిధ్యం
జింకలు, విదేశీ పక్షలను చంపి తింటున్న ఊరకుక్కలు
శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతంలో పరిస్థితి విషమం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఒక్క గాండ్రింపుతో అడవిని వణికించే పులుల రాజ్యంలో సాధు జంతువులు మందలు మందలుగా వృద్ధి చెందుతున్నాయి. పులులే లేని అరణ్యాల్లో స్వేచ్ఛగా సంతతిని వృద్ధి చేసుకునే అవకాశమున్న చోట మాత్రం శాఖాహార జీవులు నశించిపోతున్నాయి. కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాల్లో అత్యంత శ్రద్ధతో జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తున్న అటవీశాఖ అధికారులు.. నిజామాబాద్ జిల్లాలోని గోదావరి, మంజీరా పరీవాహకం, శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతాల్లో జీవజాలాన్ని కాపాడటంలో విఫలమవుతున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో జింకలు, దుప్పుల వంటి వణ్యప్రాణులు ఊరకుక్కలు, వేటగాళ్ల దాడుల్లో వేగంగా నశించిపోతున్నాయి.
కోర్‌లోని గ్రామాల తరలింపు
అభయారణ్యాల్లోని కోర్ గ్రామాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కవ్వాల్‌లో 37 ఆవాసాలు గుర్తించగా, కడెం మండలం రాంపూర్, మైసంపేటలోని 142 మంది నిర్వాసితులను పునరావాసాలకు తరలించారు. తదుపరి జన్నారం మండలం దొంగపల్లి, అల్లీనగర్, మల్యాలను తరలించనున్నారు. అమ్రాబాద్ పరిధి సార్లపల్లి, కుడిచింతలబైల్, కొల్లంపెంట, తాటిగుండాల చెంచుపెంట గ్రామాల ప్రజలకు పెద్దకొత్తపల్లి మండలం బాచారంలో పునరావాసం కల్పించనున్నారు. ఈ చర్యలతో ఇక్కడ మానవ సంచారాన్ని కూడా తగ్గిస్తుండటంతో జంతుజాలం మరింత పేరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
పెరుగుతున్న జంతుజాలం
మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ నుంచి పులులు పెన్‌గంగా, ప్రాణహిత దాటి కవ్వాల్‌లోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఏడు వరకు పులులు సంచరిస్తున్నాయి. అమ్రాబాద్ పరిధిలో 36 వరకు ఉన్నాయి. గత నాలుగేళ్లుగా క్రమంగా వీటి సంఖ్య పెరుగుతోంది. టైగర్ సఫారీకి వెళ్తున్న సమయంలోనూ సందర్శకులు ఈ పులులను నేరుగా చూడగలుగుతున్నారు. నల్లమలలో చింకార జాతి చిరుతలు, అడవి పందులు, అడవి దున్నలు, సాంబార్, చుక్కల, కొమ్ముల జింకలు, దుప్పిలు, నీల్గాయిలు, రేస్ కుక్కల, అలుగులు తదితర జంతువుల సంఖ్య పెరుగుతోంది. అనేక రకాల పక్షి జాతులు కూడా ఉన్నాయి. వీటికోసం అటవీశాఖ అధికారులు వేసవికాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి కుంటలు, గడ్డి క్షేత్రాలు పెంచి వేసవిలోనూ పచ్చదనం ఉండేలా చూస్తున్నారు. జంతువులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా మట్టితో పాటు ఉప్పు కుండీలు ఏర్పాటుచేస్తున్నారు.
కవ్వాల్‌లో ప్రత్యేక చర్యలు
కవ్వాల్ అడవుల్లో చేపడుతున్న ప్రత్యేక చర్యలతో వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోంది. ఎప్పటికప్పుడు ఆవాసాల్లో జంతువుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. విద్యుత్ తీగలతో వేటాడకుండా ఆ శాఖ అధికారులతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. – శాంతారాం, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్, కవ్వాల్ టైగర్ రిజర్వు
తగ్గుతున్న జీవవైవిధ్యం
నిజామాబాద్ జిల్లాలోని గోదావరి, మంజీరా నదుల పరీవాహకం, నాగ్‌పూర్–హైదరాబాద్ జాతీయ రహదారికి ఇరువైపులా ఇందల్వాయి ప్రాంతం వన్యప్రాణులకు, వలస పక్షులకు ఆలవాలంగా ఉంది. ఇటీవలికాలంలో ఈ జీవవైవిధ్యం తగ్గుతూ వస్తోంది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియాలో బాసర సరస్వతి అమ్మవారి ఆలయం వరకు ఎకోటూరిజం అభివృద్ధికి సర్వే కొనసాగుతుండగానే జంతువుల సంఖ్య మాత్రం వేగంగా తగ్గిపోతోంది. శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతంలోని నందిపేట, డొంకేశ్వర్, నవీపేట, మెండోరా మండలాల్లో, గోదావరి ఎడమవైపున నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలంలో జింకలు, దుప్పులు, నెమళ్లు ఆహారం కోసం సమీప గ్రామాల్లోని పంటపొలాల్లోకి వస్తుంటాయి. అటవీ అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో ఈ వన్యమృగాలను ఊరకుక్కలు వేటాడి చంపి తింటున్నాయి.
దీంతో వాటి సంఖ్య తగ్గిపోతోంది. ఈ కుక్కల దెబ్బకు విదేశీ వలస పక్షుల (ఫ్లెమింగో, పెలికాన్, పెయింటెడ్ స్టోర్క్, హెరోన్) రాక కూడా తగ్గిపోయింది. ఇక్కడ వేటగాళ్ల బెడద కూడా అధికంగా ఉంది. గత ఏడాది జింక చర్మం, కొమ్ములు, నాటు తుపాకిని అధికారులు ఓ ఇంట్లో పట్టుకున్నారు. తరువాత బోధన్ మండలంలోని ఖండ్‌గావ్ చెక్‌పోస్టు వద్ద వేటగాళ్ల ముఠా పట్టుబడింది.
తరచూ రోడ్డు ప్రమాదాలు
నాగ్‌పూర్–హైదరాబాద్ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఇందల్వాయి మండలంలోని అటవీ ప్రాంతంలో వన్యమృగాలు వాహనాల కింద పడి మరణిస్తున్నాయి. 2018 జనవరిలో రైలు ఢీకొనడంతో సిర్నాపల్లి వద్ద చిరుత మృతి చెందింది. 2019 మేలో రూప్లానాయక్ తండా వద్ద జాతీయ రహదారిపై వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. 2023 ఫిబ్రవరిలో చంద్రాయన్‌పల్లి అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మరణించింది. ఈ నెల 7న చంద్రాయన్‌పల్లి జాతీయ రహదారిపై వాహనం ఢీకొని చిరుత మృత్యువాత పడింది. వన్యమృగాలు సంచరించే అటవీ ప్రాంతం గుండా జాతీయ రహదారి వెళుతున్నప్పటికీ అండర్‌పాస్‌లు నిర్మించాలనే ఆలోచన అధికార యంత్రాంగానికి లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.