
రూ.లక్షల్లో వసూళ్లు
గురువారం బెల్లంపల్లి పట్టణంలో నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నిరుద్యోగులను ఓ సంస్థ నట్టేట ముంచింది. గత ఏడాది జూన్ విద్యాసంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, గురుకులాల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఆశ చూపి రూ.లక్షలు వసూలు చేసింది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘విద్యాంజలి 2.0’ పథకం అమలవుతోంది. ఈ పథకం కింద ఓ స్వచ్ఛంద సంస్థ స్కూల్, కాలేజీ, వసతిగృహాల్లో సిబ్బంది నియామకాలంటూ పలు రకాలుగా ప్రచారం చేసి ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేసింది. స్వీపర్ నుంచి టీచింగ్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్, ఏఎన్‌ఎంలు, వాచ్‌మెన్, వంటమనుషులు పలు రకాల పోస్టులు ఉన్నాయని, వేతనం నెలకు రూ.10వేల నుంచి రూ.18వేల వరకు ఉంటుందని నమ్మబలికింది. దీంతో విద్యాశాఖలో నిజంగానే ఉద్యోగాలుగా భావించి అనేకమంది అప్పులు చేసి మరీ ఉద్యోగాల్లో చేరారు. వీరితో మరికొంతమందిని చేర్చారు. నెలలు గడుస్తున్నా వారికి జీతాలు రాకపోవడంతో అసలు కథ బయటపడింది. అనుమానం వచ్చి నిలదీయడంతో సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్నారు. అప్పటికే పది నెలల దాక పని చేయడం గమనార్హం.
ఎలా చేర్చుకున్నారో..?
విద్యాశాఖతో సంబంధం లేని ఓ ప్రైవేటు సంస్థ ఆయా స్కూళ్లు, కాలేజీలు, వసతిగృహాల్లో సిబ్బందిని నియమించుకోవాలని చెబితే సంబంధిత బాధ్యులు ఎలా చేర్చుకున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. స్కూళ్ల హెచ్‌ఎంలు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, హాస్టళ్ల ఇన్చార్జీలు సిబ్బందితో నెలల తరబడి విధులు నిర్వర్తించుకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఆయా చోట్ల రిజిష్టర్లు పెట్టి హాజరు సైతం తీసుకున్నారు. తీరా జీతం కోసం అడిగితే ఆ సంస్థ చేర్చుకోమని చెబితే విధుల్లోకి తీసుకున్నామని సంబంధిత విద్యాధికారులు అంటున్నారు. అధికారులను సైతం ఆ సంస్థ ఏదైనా ప్రలోభాలకు గురి చేసిందా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మరోవైపు విద్యాంజలి పథకం తమ విద్యాసంస్థలో అమలవుతుందా? లేదా? జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి తెలుసుకోకుండానే సిబ్బందిని ఎలా విధుల్లోకి తీసుకున్నారనేది సందేహాలకు తావిస్తోంది. వాస్తవానికి ఈ పథకం ఎంపిక చేసిన చోట్ల, స్వచ్ఛందంగా ఎలాంటి జీతభత్యాలు చెల్లించకుండా నిర్వహించేది. దీని గురించి అవగాహన లేక ఓ సంస్థ చెప్పిన అబద్ధాన్ని నమ్మేస్తూ ఆర్థికంగా నష్టపోయారు.
స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో ఓ సంస్థ నియామకాలు
రూ.లక్షలు కట్టి నెలల తరబడి డ్యూటీ చేసిన వైనం
జీతం లేక మోసపోయామని తెలుసుకున్న నిరుద్యోగులు
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అనేక మంది బాధితులు
కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వంద మంది వరకు బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాలామంది బయట చెప్పుకుంటే అవమానంగా భావించి వివరాలు వెల్లడించడం లేదు. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు మధ్యవర్తులుగా పని చేసి రెండు జిల్లాల నుంచి అనేక మందిని చేర్పించారు. ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి తదితర చోట్ల బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేశారు. గతేడాది ఈ సంస్థ నిరుద్యోగులను మఽభ్యపెడుతున్న తీరుపై ‘సాక్షి’లో కథనం ప్రచురించగా, కొందరు చేరేందుకు వెనుకాడారు. అయినా డబ్బులు వస్తున్నాయని, కమీషన్ల ఆశతో సంస్థ సీఈవోగా ఉన్న ఓ వ్యక్తి, ఆయన కింద జిల్లా కో ఆర్డినేటర్లు, ఇన్చార్జీలు నమ్మిస్తూ అందరినీ బురిడీ కొట్టించి రూ.కోట్లు వసూలు చేసి పరారయ్యారు. ఇంతా జరిగినా బాధితులు ఎక్కడా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేయడం లేదు. కానీ నమ్మి డబ్బులు పెట్టిన వారి ఇంటికి వెళ్లి గొడవలు చేస్తున్నారు. ఇటీవల కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. మధ్యవర్తులు సైతం ఆ సంస్థను నమ్మి నిండా మునిగామని, తమ వద్ద కూడా డబ్బులు లేవని వాపోతున్నారు.

రూ.లక్షల్లో వసూళ్లు