
ఆరోగ్య సమాచారం.. ‘ఆభా’
● యాప్‌లో రోగి వివరాలు నిక్షిప్తం ● ఓపీ సమయంలోనే నేరుగా నమోదు ● అవగాహన కల్పిస్తున్న వైద్యారోగ్య శాఖ అధికారులు
మంచిర్యాలటౌన్: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మిషన్ డైరెక్టర్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆభా(ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్–ఏబీహెచ్) యాప్ ద్వారా సత్వర వైద్యసేవలకు అవకాశం కల్పిస్తోంది. దేశంలో ఆరోగ్య రంగంలో ఆధునిక, సాంకేతికతను ఉపయోగించుకుని పౌరుల ఆరోగ్య సమాచారాన్ని కచ్చితంగా భద్రపర్చుకోవడానికి, పౌరులకు మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఈ బృహత్తరమైన కార్యక్రమంపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అవగాహన కల్పిస్తోంది.
ఇలా పొందాలి..
ఆభా నంబరును ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్త, ఏబీడీఎం వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. ఇందుకోసం వెబ్‌సైట్‌లోకి వెళ్లి క్రియేట్ ఆభా నంబ రుపై క్లిక్ చేయాలి. ఆధార్, మొబైల్ నంబర్లు నమో దు చేసి డౌన్‌లోడ్ చేసుకునేందుకు సబ్‌మిట్ చేయా లి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆభా సంఖ్య నమోదు, ఆరోగ్య పరీక్షల సమాచారం నమోదుకు ఆధార్‌కార్డుతోపాటు ఓటీపీ వచ్చే మొబైల్‌ను వెంట తీసుకెళ్లాలి. ఆస్పత్రిలోని సిబ్బంది ఆభా నంబరు సృష్టించడం, హెల్త్‌కార్డులను యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు.
ఓపీ సేవలు సులభతరం
ప్రజలు ఆభా యాప్ ద్వారా వైద్య సేవలు నేరుగా పొందవచ్చు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఓపీ కోసం వచ్చిన వారి వివరాలను యాప్‌లో నమోదు చేసేలా జాతీయ ఆరోగ్య మిషన్ ఆభా ప్రోగ్రాం అధికారి నరేశ్ అవగాహన కల్పిస్తున్నారు. ఓపీ రోగులకు ఆభాపై అవగాహన కల్పించి, యాప్ డౌన్‌లోడ్ చేసి వివరాలు నమోదు చేస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతీరోజు 400కు పైగా ఓపీ కోసం రోగులు వస్తుండగా, ఓపీ స్లిప్ పొందేందుకు క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఆభా యాప్ ద్వారా అక్కడే ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేస్తే వెంటనే ఓపీ స్లిప్ వస్తుంది. సిబ్బంది వద్దకు వెళితే ఏ రకమైన వైద్య సేవలు అవసరమో అడిగి తెలుసుకుని చీటి రాసి నేరుగా వైద్యుడి వద్దకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. వైద్య సేవలు, ల్యాబ్ రిపోర్టులు నమోదుతో రోగికి ఎలాంటి వైద్యం అందించారనే పూర్తి వివరాలు వైద్యులు తెలుసుకుని అందుకు తగినట్లుగా వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని జాతీయ ఆరోగ్య మిషన్ ఆభా ప్రోగ్రాం అధికారి నరేశ్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.