
హైవేపై ఆశలు
● ప్రతిపాదనల్లోనే బెల్లంపలి–గడ్చిరోలీ ఫోర్ లైన్ ● కేంద్ర మంత్రి ‘గడ్కరీ’ పర్యటనలో హామీ ఇస్తారా? ● ఆ రోడ్డు నిర్మిస్తే రెండు జిల్లాలకు ఉపయుక్తం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్టులపై ఆశలు చిగురించాయి. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు, మహారాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయుక్తమైన బెల్లంపల్లి గడ్చిరోలీ జాతీయ రహదారిని నిర్మించాలనే డి మాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఈ ప్రతిపాదిత రోడ్డు కోసం పలుమార్లు సర్వేలు జరిగాయి. ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు లేకపోవడంతో ముందుకు కదలడం లేదు. ఇదే తీరుగా ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల రహదారి–63పై గత కొన్నేళ్లుగా జాప్యం జరుగుతోంది. ఇక్కడ రెండు సార్లు అలైన్‌మెంటు మార్పులతోపాటు రైతులు భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల పీఎం ప్రాధాన్యత జాబితాలో చోటు దక్కడంతో మళ్లీ ముందుకు కదులుతోంది. తాజాగా కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో గడ్చిరోలీ వరకు నిర్మించబోయే ప్రాజెక్టుపై కదలిక వస్తుందని రెండు జిల్లాల వాసులు ఆశలు పెట్టుకున్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న బెల్లంపల్లి, తాండూరు, రెబ్బెన, కాగజ్‌నగర్, కౌటాల మీదుగా ప్రాణహిత దాటి గడ్చిరోలీ వరకు ఈ రోడ్డు ప్రతిపాదన ఉంది. గతంలో ప్రాణహిత తీరం వెంబడి, కౌటాల నుంచి గోదావరి మీదుగా కొత్త హైవేతో భద్రాచలం వరకు హైవే నిర్మించాలని ప్రతిపాదించినా అటవీ, సాంకేతిక అనుమతుల జాప్యంతో ఆ ప్రాజెక్టునే పూర్తిగా పక్కకు పెట్టారు. ఈ క్రమంలో గడ్చిరోలీ హైవే త్వరితగతిన పూర్తయితే ఈ రెండు జిల్లాలు మహారాష్ట్రకు సులువుగా ప్రయాణం సాగించే అవకాశం ఉంది.
పూర్తయిన ఏడాదికి ప్రారంభం
కేంద్ర ఉపరితల రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి జాతీయ రహదారి–363ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. సోమవారం రెబ్బెన మండలం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద జరిగే ప్రారంభోత్సవ వేడుకకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.3500కోట్లతో నిర్మించిన ఈ రోడ్డు గత ఏడాది క్రితమే పనులు పూర్తయి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జీఎం ఆఫీసు సమీపం నుంచి రెండు సెక్షన్లుగా మహారాష్ట్ర సరిహద్దు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గోయగాం వరకు మొత్తం 94.60కి.మీ రోడ్డు నిర్మించారు. ప్యాకేజీ–1 తాండూరు మండలం రేపల్లెవాడ, అక్కడ నుంచి గోయగాం వరకు నిర్మించి మందమర్రి, వాంకిడి మండలం కమాన వద్ద టోల్‌గేట్లు ఏర్పాటు చేసి వసూళ్లు చేస్తున్నారు. ప్యాకేజీ–1 2020లో పనులు ప్రారంభం కాగా, ప్యాకేజీ–2 మాత్రం 2021లో మొదలయ్యాయి. కరోనా, వంతెనలు, ఇతర కారణాలతో జాప్యం జరిగింది. అయితే చివరకు పూర్తయింది.
మందమర్రి మండలం పులిమడుగు వద్ద ఎన్‌హెచ్–363 ఫ్లై ఓవర్‌పై మరమ్మతులు
నాణ్యతపై సందేహాలు
జాతీయ రహదారి–363 నిర్మాణంలో నాణ్యతపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వెళ్లాయి. బెల్లంపల్లి కన్నాల క్రాస్ వద్ద, రెబ్బెన మండలం తక్కెళ్లపల్లి వద్ద వన్యప్రాణుల అండర్ పాస్, గోయగాం చివరన యానిమల్ ఓవర్‌పాస్ నిర్మాణంలో నాణ్యత లోపించిందనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో భూ సేకరణ జరిగిన వరకు ఆధీనంలోకి తీసుకోకపోవడం, లైట్లు, మరమ్మతులు, నిర్వహణ లోపం కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల రోడ్డు దెబ్బతినడంతో మరమ్మతులు చేస్తున్నారు. రోడ్డు నిర్మాణదారు 15ఏళ్లు నిర్వహణ బాధ్యతలు చూడాలి. ఇప్పటికే ఏడాది పూర్తయింది. మరో 14ఏళ్లు ఇంకా కొనసాగాల్సి ఉంది. ఈ క్రమంలో భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు దెబ్బతినకుండా, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.