
భూభారతితో సమస్యలు పరిష్కారం
● పైలట్ ప్రాజెక్టుగా భీమారం ఎంపిక ● కలెక్టర్ కుమార్ దీపక్
కోటపల్లి/భీమారం: భూభారతితో రైతుల భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కోటపల్లి, భీమారం మండల కేంద్రాల్లోని రైతువేదికల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలకు తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. భూభారతి అమలుకు మే ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకో మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేస్తుందని, జిల్లాలో భీమారం మండలం ఎంపికై ందని ప్రకటించారు. ప్రస్తుత తహసీల్దార్‌తోపాటు మరో ముగ్గురిని కేటాయిస్తామని, సర్వేయర్లు, అధికారుల బృందం గ్రామాల్లో పర్యటిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, ఆర్డీవో శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, కోటపల్లి తహసీల్దార్ రాఘవేంద్రరావు, డీటీ నవీన్‌కుమార్, భీమారం తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు.
ప్రతీ రైతుకు చట్టాన్ని వివరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: భూభారతి నూతన ఆర్‌వోఆర్ చట్టంలో పొందుపర్చిన హక్కులు, అంశాలను ప్రతీ రైతుకు వివరించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, గృహ నిర్మాణాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, హౌసింగ్ పీడీ బన్సీలాల్ పాల్గొన్నారు.